Trishul News

వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలవదు.. గెలవనివ్వం - పవన్ కళ్యాణ్

- తన వారాహి వాహనాన్ని టచ్ చేయండి.. నేనేంటో చూపిస్తా 

- అంబటి కాపుల గుండెల్లో కుంపటి

- వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
గుంటూరు, త్రిశూల్ న్యూస్ :
తన వారాహి వాహనాన్ని టచ్ చేస్తే.. తానేంటో చూపిస్తానంటూ వైసీపీ వర్గాలకు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన వద్ద అక్రమంగా సంపాదించిన డబ్బులు లేవని, అభిమానులు ఇచ్చిన విరాళాలతోనే పార్టీని నడుపుతున్నానని, పార్టీ నడపడం బాధ్యత అని అన్నారు. అన్నం పెట్టిన నేలకి మేలు చేయకుండాపోతే అదేం బ్రతుకని ధ్వజమెత్తారు. అన్నం పెట్టే రైతు కన్నీరు పెడితే.. అది క్షేమం కాదన్నారు. రాష్ట్రంలో మూడు వేల పైచిలుకు రైతులు చనిపోయారన్నారు. ప్రభుత్వ బాధ్యత తన చేతిలో పెడితే.. ప్రతి ఒక్కరికీ మేలు చేస్తానని హామీ ఇచ్చారు. ఏ జిల్లాలోనూ రైతు క్షేమంగా లేడని ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరించడానికి, సభ జరుపుకోవద్దని చెప్పుకోవడానికి అధికార యంత్రాంగం ఉందని వైసీపీ ప్రభుత్వంపై పవన్ కౌంటర్ వేశారు. వారాహి రంగు బాగులేదంటూ విమర్శలు చేస్తున్నారు.. అసలు మీరు చేసే దోపిడి ముందు ఈ రంగు ఎంత? అని ప్రశ్నించారు.
కరప్షన్ హాలీడే ప్రకటించినట్లు వాళ్ళ నాయకుడే చెప్పాడని పవన్ వ్యాఖ్యానించారు. తాను అంబేద్కర్ ఆశయాల్ని అర్థం చేసుకున్నానన్నారు. వైసిపి గాడిదలకు తాను భయపడనని.. వాళ్లు అరుపులు, కేకలు పెడుతున్నారని విమర్శించారు. సత్తెనపల్లి నాయకులు వచ్చిన ఏడు లక్షలివ్వాలంటే, రెండు లక్షల లంచం తీసుకుంటున్నారని.. ఎమ్మెల్యే స్థాయి నేత దోపిడి చేస్తే ఎలా..? అని నిలదీశారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటి అని విరుచుకుపడిన పవన్.. పోలవరం ప్రాజెక్ట్‌ని పూర్తి చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. నన్ను రానివ్వమంటూ బెదిరిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవకుండా చూసే బాధ్యత తనదని పవన్ పేర్కొన్నారు. ఈసారి ప్రభుత్వం మారబోతోందని, వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ఏడు లక్షలకు రెండు లక్షలలు తీసుకునే దరిద్రపు మనస్తత్వం తనది కాదన్నారు. అంబటి రాంబాబులా శవాలపై పేలాలు వేరకోలేనని.. వైసిపి గాడిదల్లా మాట్లాడలేని అన్నారు. రౌడీయిజం తగ్గాలన్నారు. ఏపీకి స్థిరత్వం రావాలని, ప్రభుత్వ వ్యవస్థలు బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలకి పోలీసులు వార్నింగ్ ఇవ్వాలని పవన్ కోరారు. అధికార పార్టీకి, ప్రతిపక్షానికి మరో రకంగా రూల్స్ ఉండవన్నారు. పల్నాడులో 144 సెక్షన్ ఉండటం వల్ల తాను సమన్వయం పాటిస్తున్నానన్నారు. క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ అంటున్నారని.. అది నిజమేనని అన్నారు. ఇది వర్గ యుద్ధమని తెలిపారు.
2014 లాంటి కూటమి ఉండుంటే.. అసెంబ్లీలో బలమైన గొంతు ఉండేదన్నారు. కారణమేదైనా అది జరిగలేదని.. అధికారం రాని కులాలకి అధికారం ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. బీసీ సభలో ఎన్ని రకాల కూరలు పెట్టాం, ఎన్ని రకాల బిర్యానీలు పెట్టామని అంటున్నారని.. అది ముఖ్యం కాదని.. సరైన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు బిర్యానీ పెట్టామని కాదు.. ఎంతమందికి ఉద్యోగం ఇచ్చామని ఆలోచించుకోవాలని పవన్ చెప్పారు. దామాషా పద్ధతి రావాలని, మేమెంతో మాకంతా అన్న విధానం రావాలని కోరారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనన్న దానికి ఇఫ్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు. బీజేపీ, టీడీపీకి అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదన్నారు. మీ అందరి గుండె చప్పుడుంటే.. తాను సీఎం అవుతానన్నారు. వైసీపీ చెప్పినవన్నీ చేసి ఉంటే, అసలు తాను వచ్చేవాడ్ని కానన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఫండ్స్ తినకుండా ఉండాల్సిందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఉండాల్సిందన్నారు. అంతా మాదే అనేది వైసీపీ తత్వమని.. ఇది మారాలంటే వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలన్నారు.  ప్రభుత్వం మారకపోతే ఏపీ రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోతుందని పవన్ పేర్కొన్నారు. అధికారం చూసిన కులాలపై తనకు కోపం లేదని, అధికారం చూడని కులాలకి అధికారం రావడమే జనసేన లక్ష్యమని అన్నారు. బెదిరించే నాయకులుంటే, ఎదిరించే యువత ఉండాలన్నారు. వైసీపీ వచ్చే ఎన్నికలు కోసం చూస్తుంటే, తాను రెండు తరాల గురించి ఆలోచిస్తున్నానన్నారు. ప్రభుత్వంలో అన్ని అంశాలపై శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. తాను సీఎం కావాలని అనుకుంటే అవ్వనని, మీరు అనుకుంటే అవుతానన్నారు. తన వ్యూహమంతా ఏపీ భవిష్యత్తేనని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కూడా వైసీపీ హింసా మార్గాన్ని అనుసరిస్తుందని, కేసులు పెడతారని ఆరోపించారు. మార్పు రావాలంటే.. పోరాటం చేయాల్సిందేనని పవన్ పిలుపునిచ్చారు. రక్తం చిందించడానికి, జైలుకి వెళ్ళడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. మాచర్లలో ఆఫీసులు ఎలా తగలబెట్టారో, గొడవలు ఎలా చేశారో అందరూ చూశారుగా! అని నిలదీశారు. అధికారం చేజారిపోతుందన్న భయంతోనే ఇలాంటి గొడవలకు దిగుతున్నారన్నారు. జనసేన వ్యూహం తనకు వదిలేయండని, జనసేనను అధికారంలోకి ఎలా తీసుకెళ్లాలన్న బాధ్యత తనదని చెప్పారు. వారాహిలో ఏపి రోడ్లపై తిరుగుతానని.. ఎలా ఆపుతారో చూస్తానని పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేశారు.
జనసేనానికి ఘన స్వాగతం..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సత్తెనపల్లికి చేరుకున్నారు. గుంటూరు శివారు నల్లపాడు వద్ద పవన్ అభిమానులు గజమాలతో ఆయనను సత్కరించారు. అయితే పోలీసులు ఇందుకు అభ్యంతరం తెలిపారు. పవన్ కల్యాణ్ కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని పోలీసులు వారించారు. ప్రొక్లెయిన్ తో గజమాల వేస్తున్నట్లు ముందుగా తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని పోలీసులు జనసేన నేతలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా జనసేన నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పూలమాల వేయకూడదా? అంటూ నిరసన తెలియజేయడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Post a Comment

Previous Post Next Post