Trishul News

మేం రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర కాలేదు - ఏపీఎన్జీవో అధ్యక్షుడు

విజయవాడ, త్రిశూల్ న్యూస్ :
రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి డీఏ, ఇతర బకాయిలను చెల్లించలేదని ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నందుకు ఉద్యోగ సంఘాల నేతలుగా సిగ్గు పడుతున్నామన్నారు. వేతనాల కంటే ముందు పెన్షన్‌ ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం మర్యాద నిలబెట్టుకోవాలని బండి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ ఎన్జీవో కార్యవర్గంతో పాటు జేఏసీ సమావేశాల్లో చర్చించి తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గర కాలేదని.. ఉద్యోగుల ప్రయోజనాల కోసమే పోరాడుతోందని బండి శ్రీనివాసరావు చెప్పారు. ఉద్యోగుల సమస్యలను గవర్నర్‌ దగ్గర చెప్పుకోవాలి తప్ప.. ఇతర సంఘాల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) అధ్యక్షుడు సూర్యనారాయణను ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. ఏపీ ఎన్జీవో సంఘం చాలా ఏళ్ల క్రితం ఏర్పడిందన్నారు. ఏపీజీఈఏకు అనుమతి ఎలా వచ్చిందో అందరికీ తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ ఎన్జీవో సంఘం సాధించిన కారుణ్య నియామకాల ఉత్తర్వుల ద్వారానే సూర్యనారాయణకు ఉద్యోగం వచ్చిందన్నారు. సూర్యనారాయణ అధ్యక్షత వహిస్తున్న సంఘం గుర్తింపు రద్దు చేయాలని సీఎస్‌ను కోరతామన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని చట్టాలు, నిబంధనలు ఉన్నాయని.. కానీ ప్రభుత్వం పాటించడం లేదని బండి శ్రీనివాసరావు అన్నారు.

Post a Comment

Previous Post Next Post