నంద్యాల, త్రిశూల్ న్యూస్ :
గత మూడు రోజుల క్రితం గెలివి ఇండస్ట్రీస్ అధినేత రామకృష్ణ సొంత స్థలాన్ని ఆక్రమించుకునేందుకు వెళ్లి మళ్లీ అతని పైనే దాడి చేయించిన టీడీపీ నాయకులు ఉరుకుంద, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సీనియర్ నాయకులు తోట మద్దులు,పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహులు, కే మహమ్మద్ గౌస్ లు డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ నంద్యాల నుండి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని అందించి ప్రపంచంలోనే మంచి ఘనత ఉందని, అంతేకాకుండా నంద్యాలలో వివిధ ముస్లిం, బలిజ, ఆర్య వైశ్య కులాల వారు మెజార్టీగా ఉన్న ఎవరి కుటుంబ అభివృద్ధి వారు చూసుకుంటూ ఇతరుల జోలికి వెళ్లకుండా ఉన్నారని, చాలా ప్రశాంతమైన వాతావరణం నంద్యాలకు ఉందన్నారు. అటువంటి వాతావరణంలో నంద్యాల జిల్లా ఏర్పాటైన నుండి ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో వాటిని ఆక్రమించుకునేందుకు దొంగ పట్టాలు సృష్టించి, ఎవరి దగ్గర పాత ఆస్తులు ఉన్నాయో వారిని టార్గెట్ గా ఎంచుకొని వారిపై దాడులకు పాల్పడడం అనవాయితి గా మారిందన్నారు. గత మూడు నెలలుగా ఆర్యవైశ్యులపై దాడులు ఎక్కువయ్యాయని, వీటిని అరికట్టడంలో శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసు అధికారులు విఫలం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అటువంటి వారిపై నిఘా వేసి కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారంలో ఉన్న మంత్రి ఫరూక్ చొరవ తీసుకొని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో సమీక్ష చేసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా శాంతి భద్రతలు కాపాడి నంద్యాలను ప్రశాంత వాతావరణం లో ఉంచేలా చూడాలని కోరారు. ఆర్యవైశ్యులకు, ఇతరులకు ఏ అన్యాయం జరిగినా, దాడులు జరిగిన సిపిఎం పార్టీ అండగా ఉండి వాళ్ళు చేసే పోరాటాలకు మద్దతుగా నిలబడి రాజీలేని పోరాటాలు చేస్తుందని తెలిపారు.

No comments:
Post a Comment