Trishul News

ప్రకృతివనం కోసం తమ భూమిని లాక్కొన్నారు..!

- యువ రైతు ఆత్మహత్యాయత్నం
మెదక్, త్రిశూల్ న్యూస్ :
మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం దేవరపల్లిలో యువ రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ప్రకృతివనం కోసం తమ భూమిని లాక్కుంటున్నారంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగే సమయంలో సెల్ఫీ వీడియో తీశాడు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న 5 ఎకరాల భూమిని అటవీ శాఖ అధికారులు, గ్రామ సర్పంచ్‌ లాక్కున్నారని పేర్కొన్నారు. తమ భూమిని బలవంతంగా తీసుకుని ప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నారని, ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటే తనకు చావు తప్ప మరో మార్గం లేదంటూ శ్రీశైలం అనే యువ రైతు పురుగుల మందు తాగేశాడు. వెంటనే అతన్ని మెదక్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స చేయడంతో ప్రస్తుతం శ్రీశైలం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రైతు జింక శ్రీశైలం ఐదెకరాల భూమిలో అధికారులు పంటలను తొలగించేందుకు వెళ్లారు. ప్రొక్లెయిన్‌ను తీసుకొచ్చిన మహిళా అధికారిని శ్రీశైలం, అతని తల్లి అడ్డుకునే యత్నం చేశారు. మహిళా అధికారి కాళ్లకు మొక్కాడు. ఇది అటవీభూమేనని చెప్పడంతో.. తమ ఐదుగురిని చంపి పాతి పెట్టి భూమి తీసుకోవాలని శ్రీశైలం వాపోయాడు. తీవ్ర మనోవేధనకు గురైన శ్రీశైలం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగే సమయంలో రైతు జింక శ్రీశైలం సెల్ఫీ వీడియో తీశాడు. సర్పంచ్‌, అధికారుల తీరుతో జీవితంపై విరక్తి చెందానంటూ తీవ్ర ఆవేదనతో మాట్లాడాడు. పంటలను దున్నివేయడంతో జీవనాధారం కోల్పోయామని వాపోయారు. తన పాప, బాబుకైనా న్యాయం జరగాలని కోరుతూ సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగాడు. పురుగుల మందు తాగిన శ్రీశైలంకు మెదక్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post