Trishul News

రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల్లో శాశ్వత ప్రాతిపదికన ట్రిబ్యునళ్లు..!

- సమగ్ర భూసర్వే ముగిసిన తర్వాతా కొనసాగింపు

- న్యాయపరమైన హక్కులను వేగంగా పొందేందుకు అవకాశం

- సర్వే నంబర్ల జాబితాలో వివాదాల వివరాలు కూడా నమోదు

- ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం జగన్‌ కీలక నిర్ణయం
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు లంచాలకు తావులేకుండా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భూ వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ట్రిబ్యునళ్లను సమగ్ర భూ సర్వే ముగిసిన తర్వాత కూడా కొనసాగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. భూముల రీ సర్వే సందర్భంగా తలెత్తే వివాదాలు, అభ్యంతరాల పరిష్కారానికి ఏర్పాటైన మొబైల్‌ ట్రిబ్యునళ్లను ఆ తరువాత కూడా రెవెన్యూ డివిజన్లలో పూర్తి స్థాయిలో కొనసాగించాలని సూచించారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ..

వివాదాల పరిష్కారానికి సమర్థ యంత్రాంగం..!
భూముల సర్వే సందర్భంగా తలెత్తే వివాదాల పరిష్కారానికి సరైన యంత్రాంగం ఉండాలి. మొబైల్‌ ట్రిబ్యునల్‌ యూనిట్లపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. భూ వివాదాల పరిష్కారానికి రాష్ట్రంలో అత్యుత్తమ వ్యవస్థను తెచ్చి శాశ్వత ప్రాతిపదికన ప్రతి రెవెన్యూ డివిజన్‌ కేంద్రంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. దీనివల్ల న్యాయపరంగా దక్కే హక్కులను వేగంగా పొందేందుకు వీలుంటుంది. వివాదాల్లో కూరుకుపోయి తరతరాలుగా హక్కులు పొందలేని పరిస్థితి ఉండకూడదు. సర్వే సందర్భంగా ప్రభుత్వంతో వివాదాలు, వ్యక్తిగత వివాదాలను అంశాలవారీగా గుర్తించాలి. సర్వే నంబర్ల జాబితాలో ఈ వివాదాలను కూడా పేర్కొనాలి. దీనివల్ల భూమి లీగల్‌గా క్లియర్‌గా ఉందా? లేదా? అన్నది కొనుగోలుదారులకు తెలుస్తుంది. అదే సమయంలో వివాదాలను పరిష్కరించే ప్రయత్నం సమాంతరంగా జరగాలి.

అప్పీళ్లపై థర్డ్‌ పార్టీ పర్యవేక్షణ..!
సర్వేలో నాణ్యత చాలా ముఖ్యం. వివాదాల పరిష్కారంలో నాణ్యతతో కూడిన ప్రక్రియ ఉండాలి. సమగ్ర సర్వే సందర్భంగా వచ్చే అప్పీళ్లపై థర్డ్‌ పార్టీ పర్యవేక్షణ ఉండాలి. దీనివల్ల హక్కుదారులకు ఎలాంటి నష్టం ఉండదు. తప్పులకు పాల్పడే సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. థర్డ్‌ పార్టీ పర్యవేక్షణ వల్ల పక్షపాతం, వివక్ష, అవినీతికి తావుండదు. సిబ్బందిలో కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. ఎవరైనా ఓ వ్యక్తి తన భూమిలో సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే, కచ్చితంగా సర్వే చేయాలి. నిర్ణీత సమయంలోగా సర్వే చేయకుంటే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ఎస్‌వోపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) రూపొందించాలి.

వేగం పెరగాలి..
నెలకు వెయ్యి గ్రామాల చొప్పున ఏరియల్, డ్రోన్‌ ఫ్లైయింగ్‌ చేస్తున్నట్లు అధికారులు పేర్కొనగా ఈ లక్ష్యాన్ని పెంచాలని సీఎం ఆదేశించారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కూడా సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. 2023 సెప్టెంబరు నెలాఖరు నాటికి సమగ్ర సర్వేను పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. సమావేశంలో విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) జి.సాయిప్రసాద్, మున్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ సిద్దార్ధ జైన్, సీసీఎల్‌ఏ కార్యదర్శి అహ్మద్‌ బాబు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

సీఎం జగన్‌ను కలిసిన టెక్‌ మహీంద్ర ఎండీ గుర్నాని
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఐటీ, హై ఎండ్‌ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి పెంపుపై టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించారు. మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయిన గుర్నాని ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో వీటిని అమలు చేసి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు. విశాఖలో టెక్‌ మహీంద్ర కార్యకలాపాల విస్తరణపై వివరించారు. అనంతరం టెక్‌ మహీంద్రతో కలిసి పని చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. సమావేశంలో టెక్‌ మహీంద్ర గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (అడ్మినిస్ట్రేషన్‌) సీవీఎన్‌ వర్మ, సీనియర్‌ బిజినెస్‌ హెడ్‌ రవిచంద్ర కొల్లూరు, రిక్రూట్‌మెంట్‌ లీడర్‌ శ్రీనివాస్‌ రెడ్డి వీరంరెడ్డి, అడ్మిన్‌ మేనేజర్‌ (విజయవాడ) జయపాల్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన గుర్నాని ఏపీలో టెక్‌ మహీంద్ర కార్యకలాపాలు, విస్తరణపై చర్చించిన విషయం విదితమే.

Post a Comment

Previous Post Next Post