Trishul News

'హర్ ఘర్ తిరంగా' ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం..!

- చైతన్య ర్యాలీలో మేయర్, కమిషనర్
నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తికావొస్తున్న నేపథ్యంలో 'హర్ ఘర్ తిరంగా' ఉత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ నిర్దేశాల మేరకు ఘనంగా నిర్వహించుకుందామని నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి, కమిషనర్ డి.హరితలు పేర్కొన్నారు. స్థానిక సర్వోదయా కళాశాల ప్రాంగణం నుంచి చైతన్య ర్యాలీని జెండా ఊపి మేయర్, కమిషనర్ ఆదివారం ఉదయం ప్రారంభించారు. ర్యాలీలో భాగంగా మద్రాస్ బస్టాండ్ కూడలిలోని జవహర్ లాల్ నెహ్రూ, టంగుటూరి ప్రకాశం పంతులు, విఆర్సీ కూడలిలోని అంబేద్కర్ విగ్రహాలతో పాటు చివరిగా గాంధీ బొమ్మ కూడలిలో మహాత్ముని విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీని ఉద్దేశించి మేయర్, కమిషనర్ మాట్లాడుతూ ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని కనీవినీ ఎరగని రీతిలో పౌరులంతా విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. నగర వ్యాప్తంగా ప్రతీ ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడేలా ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ జాతీయ పండగను కన్నుల పండుగగా చేపట్టాలని సూచించారు. 
దేశ చరిత్రలో తొలిసారిగా ఏర్పాటుచేస్తున్న 'హర్‌ ఘర్‌ తిరంగా' ఉత్సవంలో రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వరంగ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌ కంపెనీలతో పాటు అన్ని యంత్రాంగాలూ పాలుపంచుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ విశేష వేడుక పౌరుల్లో మరోసారి దేశభక్తిని, జాతీయ భావాన్ని రగిలిస్తుందని వారు ఆకాంక్షించారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో అమరులైన ఎంతో మంది వీరుల స్ఫూర్తిని 'హర్‌ ఘర్‌ తిరంగా' కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో, యువతలో నింపాలని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన స్వదేశీ ఉద్యమం, క్విట్‌ ఇండియా మూమెంట్‌, సహాయ నిరాకరణ వంటి కార్యక్రమాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు చేపట్టిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొనడం శుభ పరిణామం అని వారు సంతోషం వ్యక్తం చేసారు. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్”లో హర్‌ ఘర్‌ తిరంగా ఒక మైలురాయిగా నిలవాలని మేయర్, కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్, జెడ్పీ సీఈఓ వాణి, కార్పొరేటర్ లు యాకసిరి వాసంతి, గుంజి జయలక్ష్మి, నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post