Trishul News

ఆర్మీ ట్రక్కుకు ఘోర ప్రమాదం.. 16 మంది సైనికులు మృతి..!

సిక్కం, త్రిశూల్ న్యూస్ :
ఈశాన్య రాష్ట్రం సిక్కింలోని భారత్-చైనా సరిహద్దు సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడి 16 మంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. ఉత్తర సిక్కింలోని జెమా ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం మూడు వాహనాలతో ఆర్మీ కాన్వాయ్‌ ఛట్టెన్‌ నుంచి థంగు ప్రాంతంలోని బోర్డర్‌ పోస్ట్‌లకు వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఇందులోని ఓ వాహనం దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురైంది. మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి లోయలో పడింది. ఘటన సమయంలో ట్రక్కులో 20 మంది జవాన్లు, జూనియర్‌ కమిషన్‌ అధికారులున్నారు. వందల అడుగుల ఎత్తు నుంచి పడటంతో వాహనం తునాతునకలైంది. సమాచారమందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలంలో 16 మృతదేహాలను అధికారులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు జూనియర్‌ కమిషన్‌ అధికారులు, 13 మంది జవాన్లు ఉన్నారు. మరో నలుగురు గాయపడగా.. వారిని హెలికాప్టర్లలో ఉత్తర బంగాల్‌లోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు ఏ రెజిమెంట్‌కు చెందినవారన్నది ఇంకా తెలియరాలేదు.
సంతాపం తెలిపిన మోదీ, ముర్ము..
సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సైన్యానికి చెందిన వీర జవాన్లు ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. "మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అంటూ ముర్ము ట్వీట్​ చేశారు. మోదీ కూడా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

రాజ్‌నాథ్‌ దిగ్భ్రాంతి..
ఉత్తర సిక్కింలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైనికులు మృతి చెందిన ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వారు అందించిన సేవలు, నిబద్ధతకు ఈ దేశం రుణపడి ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన రాజ్‌నాథ్‌.. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు.

Post a Comment

Previous Post Next Post