Trishul News

భవన నిర్మాణాలను క్రమంతప్పకుండా పరిశీలించండి - కమిషనర్ హరిత

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
నగర వ్యాప్తంగా జరుగుతున్న నూతన భవనాల నిర్మాణాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, నిర్మాణాలన్నీ నగర పాలక సంస్థ అనుమతులు పొందేలా పర్యవేక్షించాలని సచివాలయ వార్డు ప్రణాళిక కార్యదర్శులను కమిషనర్ హరిత ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం, వార్డు సచివాలయ ప్రణాళిక కార్యదర్శులతో సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భవన నిర్మాణ సామగ్రి, పాత భవనాలను కూల్చిన శిధిలాలు వీధులు, రోడ్లను ఆక్రమించుకుని ప్రజలకు అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించాలని సూచించారు. రోడ్లపై అక్రమంగా భవన నిర్మాణ సామాగ్రి కనిపిస్తే నోటీసులు జారీచేసి అపరాధ రుసుము వసూలు చేయాలని కమిషనర్ ఆదేశించారు. లేఅవుట్ రెగ్యులైజేషన్ పధకంపై భూమి యజమానులకు అవగాహన పెంచి, పధకం అమలును వేగవంతం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పధకంలో భాగంగా వార్డుల పరిధిలోని అసెస్మెంట్ లను రీసర్వే చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని, కమిషనర్ & డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆదేశాలను అనుసరించి రీ సర్వే పనులను పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా పెండింగులో ఉన్న ఎల్.ఆర్.ఎస్ ప్యాట్రన్స్, అప్లికేషన్ లను సమీక్షించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనుమతులు లేని కట్టడాల నిర్మాణాన్ని తొలిదశలోనే గుర్తించి అడ్డుకోవాలని కమిషనర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, వార్డు సచివాలయ ప్రణాళిక కార్యదర్శులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post