Trishul News

శబరిమల ఆలయానికి భారీగా ఆదాయం.. 39రోజుల్లోనే రూ.223 కోట్లు..!

శబరిమల, త్రిశూల్ న్యూస్ :
శబరిమల అయ్యప్ప ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. 39 రోజుల వ్యవధిలో రూ.222 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు దేవస్థానం వెల్లడించింది. స్వామి దర్శనానికి చిన్నారులు అధిక సంఖ్యలో వచ్చారని తెలిపింది. శబరిమల అయ్యప్పపై కాసుల వర్షం కురిసింది. ఆలయానికి 39 రోజుల వ్యవధిలో రూ.200 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. నవంబర్ 17న మండల పూజలు ప్రారంభం కాగా.. అప్పటి నుంచి పెద్ద ఎత్తున భక్తులు శబరిమల దర్శనానికి పోటెత్తారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చిన నేపథ్యంలో హుండీ ఆదాయం సైతం గణనీయంగా నమోదైంది. మొత్తంగా రూ.222.98 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రావెన్​కోర్ దేవస్థాన బోర్డు అధ్యక్షుడు కే అనంతగోపన్ వెల్లడించారు. ఇందులో భక్తులు నేరుగా సమర్పించిన మొత్తం రూ.70.15 కోట్లు అని చెప్పారు. సుమారు 30 లక్షల మంది భక్తులు శబరిమలను దర్శించుకున్నారని.. అందులో ఐదో వంతు చిన్నారులే ఉన్నారని తెలిపారు. గడిచిన రెండేళ్లలో రాలేకపోయిన నేపథ్యంలో ఈసారి చిన్నారులు భారీ సంఖ్యలో దర్శనానికి వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు. కాగా, 41 రోజుల మండల పూజలు మంగళవారంతో ముగియనున్నాయి. స్వామివారికి మధ్యాహ్నం పూజలు నిర్వహించి ఆలయాన్ని మూసేయనున్నారు. మూడు రోజుల విరామం అనంతరం డిసెంబర్ 30న సాయంత్రం 5 గంటలకు మకరవిళక్కు పర్వదినం కోసం అయ్యప్ప ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు. మకర సంక్రాంతి రోజున భక్తులు జ్యోతి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం జనవరి 20న ఆలయాన్ని మళ్లీ మూసివేస్తారు.

Post a Comment

Previous Post Next Post