Trishul News

నివురుగప్పిన నిప్పులా మాచర్ల.. టిడిపి నేతలు హౌస్ అరెస్ట్..!

గుంటూరు, త్రిశూల్ న్యూస్ :
పల్నాడు జిల్లా మాచర్లలో రణరంగం తర్వాత అక్కడి పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అధికారమే అండగా వైకాపా అల్లరి మూకలు.. ఇళ్లపై పడి చేసిన విధ్వంసం నుంచి భాధితులు ఇంకా తేరుకోలేదు. నగలు, విలువైన ఆభరణాలు దోచుకున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన పరిణామాలతో మాచర్ల పట్టణంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. భారీగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు మాచర్లలో వైకాపా శ్రేణుల విధ్వంసకాండను నిరసిస్తూ జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందించేందుకు 'చలో నరసరావుపేట' పేరుతో తెదేపా నేతలు బయల్దేరగా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పార్టీ నేతలు నరసరావుపేట వెళ్లకుండా పల్నాడు ప్రాంతంలోని నేతలను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. దీంతో పలుచోట్ల పోలీసులు, తెదేపా నేతల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. వినుకొండలో పల్నాడు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజేయులు తదితరులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ జీవీ ఆంజనేయులు ఆందోళనకు దిగారు. రోడ్డుపైనే బైఠాయించి ఆయన నిరసన తెలిపారు. మరోవైపు పోలీసు వలయాన్ని ఛేదించుకొని నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్ర నరసరావుపేటకు కారులో బయల్దేరి వెళ్లారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ తెదేపా నేతలు మండిపడ్డారు.

Post a Comment

Previous Post Next Post