Trishul News

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కోర్కెలకు ముఖ్యమంత్రి జగన్ కళ్లెం..?

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ప్రభుత్వ ఉద్యోగులను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అద్భుత విజయం సాధించింది. అత్యాశకు పోతే మొదటికే మోసం వస్తుందన్న సంకేతం బలంగా ఇచ్చింది. కోర్టులకు వెళితే నష్టం ఉద్యోగులకేనంటూ మంత్రి బొత్సా ఇటీవల హెచ్చరించారు. అంతేకాదు ఏడాదికి రూ. 80వేల కోట్లు ఉద్యోగులకు పోతున్నాయని గుర్తు చేశారు. ఎంత చేసినప్పటికీ ఉద్యోగులు కొత్త సమస్యలు తీసుకొస్తూనే ఉంటారని ఆయన చేసిన కామెంట్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ అభిప్రాయం ఏ విధంగా ఉందో స్పష్టం చేశారు. దీంతో కుక్కిన పేనులా పనిచేయడం మినహా మరో మార్గంలేదని గొంతెమ్మ కోర్కెలను ఉద్యోగులు పక్కన పెట్టారు. ఉద్యోగులు సంక్షేమ సంఘం సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డిని ఇటీవల ప్రభుత్వం నియమించింది. ఆయన బాధ్యతలు స్వీకరిస్తోన్న రోజు మంత్రి బొత్సా, ప్రభుత్వం సలహాదారు సజ్జల హాజరయ్యారు. ఆ సందర్భంగా 12వ పీఆర్సీ వేయాలని కోరడం మంత్రి బొత్సాకు మండింది. గత పీఆర్సీలో అన్యాయం జరిగిందని ఉద్యోగులు చెప్పడాన్ని తప్పుబడుతూ, రాష్ట్రం బడ్జెట్లో 80వేల కోట్లు ఉద్యోగులకు పోతున్నాయన్న నిజాన్ని బయటపెట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా ఆశించొద్దని హెచ్చరించారు. ఇప్పటికే పలుమార్లు సీపీఎస్ రద్దు మీద పోరాటం చేసిన ఉద్యోగులు ఇటీవల సైలెంట్ అయ్యారు. ఛలో విజయవాడ తరువాత సీపీఎస్ రద్దు డిమాండ్ చేస్తూ మరో ఉద్యమం చేయడానికి సన్నద్ధం అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ వాళ్లను కంట్రోల్ చేసింది. సీపీఎస్‌ సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మనస్తాపం చెందిన ఓ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కర్నూలు జిల్లాలో బుధవారం వెలుగుచూసింది. ఆయన చెన్నప్ప ప్యాపిలి మండలం ఆలేబాద్‌లోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. సిపిఎస్‌కి తన అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించిందని, తన ఆత్మహత్య పెండింగ్ లో ఉన్న సీపీఎస్ రద్దు అంశాన్ని అమలు చేసేలా చేస్తుందని వాట్సాప్ మెసేజ్ పెట్టడం ఉద్యోగ సంఘాలను కలవరపెట్టింది. వాస్తవంగా సీపీఎస్ బదులుగా జీపీఎస్ అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఉద్యోగులు మాత్రం సీపీఎస్ రద్దుకు పట్టుబడుతున్నారు. ఆ దిశగా చేసిన ఉద్యమాలను వ్యూహాత్మకంగా జగన్ సర్కార్ కంట్రోలు చేయడాన్ని పలువురు ప్రశసిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగులు ప్రభుత్వాలను నడిపే పరిస్థితి వచ్చారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తరువాత ఏర్పడిన ఏపీలో పనిచేయడానికి చాలా మంది నిరాకరించారు. బలవంతంగా వాళ్లను ఏపీకి చంద్రబాబు తీసుకురావాల్సి వచ్చింది. వాళ్లు అడిగిన గొంతెమ్మ కోర్కెలను ఆనాడున్న సీఎం చంద్రబాబు తీర్చారు. అంతేకాదు ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్ బాబుకు ఎమ్మెల్సీ పదవిని కూడా ఇచ్చారు. ఆనాటి ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని శాసించారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చేయాలని ప్రయత్నించారు. తొలుత పైచేయి సాధించినట్టు కనిపించినప్పటికీ ఆ తరువాత వాళ్ల కోర్కెలను అదుపు చేయగలిగారు. తాజాగా ఉద్యోగుల గురించి మంత్రి బొత్సా చేసిన కామెంట్లను పరిశీలిస్తే, రాబోవు ఎన్నికల్లో ఉద్యోగుల వ్యతిరేక ఎజెండాతో ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన అవసరంలేదు. ఎందుకంటే, ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వ్యతిరేకత ఉంది. లంచం లేకుండా పనిచేసే ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంది. ఆ కోణం నుంచి ఆలోచిస్తోన్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఉద్యోగుల ఉడతూపులకు భయపడి గొంతెమ్మ కోర్కెలను తీర్చడానికి సిద్ధంగా లేదనే సంకేతం ఇచ్చింది. పీఆర్సీ వేయడానికి సిద్ధంగా లేమనే సంకేతం ఇవ్వడంతో పాటు సీపీఎస్ రద్దు సాధ్యం కాదని చెప్పేసింది. ఇక ఉద్యోగులు ఏమి చేస్తారో చూడాలి.

Post a Comment

Previous Post Next Post