Trishul News

ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూలీల కంటే హీనంగా ఉంది - ఏపీ ఎన్‌జీవో

- ఏపీ ఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు వివాదస్పద వ్యాఖ్యలు 

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి `కూలీల కంటే హీనం`గా ఉందని ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. `ప్రభుత్వాలను పడగొడతాం..నిలబెడతాం..` అంటూ గతంలో సంచలన కామెంట్స్ ఆయన చేశారు. ఈసారి కూలీలను కించపరుస్తూ ఆయన మాట్లాడిన మాటలు సభ్యసమాజం ఆగ్రహించేలా ఉన్నాయి. వాస్తవంగా ఎంతో నిజాయితీగా కూలీలు పనిచేస్తారు. నిర్విరామ శ్రమతో చెమటోడ్చి దినసరి కూలీ సంపాదించుకుంటారు. దానితోనే జీవితాన్ని నిజాయితీగా నడిపిస్తారు. వాళ్ల కంటే సమాజంలో నిజాయితీపరులు ఎవరూ ఉండరని ఎవరైనా చెబుతారు. కూలీల సంపాదన తక్కువే కావచ్చు. కానీ, వాళ్ల నిజాయితీ ముందు అవినీతిపరులైన ఉద్యోగులు దిగతుడుపే. ఏపీ ఉద్యోగులకు జీతాలు సకాలంలో అందడంలేదు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పెడుతుందని వాళ్లకు తెలుసు. అయినప్పటికీ పీఆర్సీతో పాటు అనేక కోర్కెలు తీర్చాలని డిమాండ్లు పెట్టారు. ఇప్పుడు ఇస్తోన్న జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందని బాగా తెలిసిన వాళ్లు ఉద్యోగులు. వాళ్లే జీతాలను పెంచమని కోరడం విచిత్రం. ఇక పని దినాలను తగ్గించాలని మరో డిమాండ్ వాళ్లది. దినసరి కూలీలతో పోల్చుకుంటే ప్రభుత్వం ఉద్యోగుల ఆదాయం కొన్ని వందల రెట్లు ఎక్కువ. అయినప్పటికీ అవినీతిపరులైన ఉద్యోగులు 90శాతానికి పైగా ఉంటారని అంచనా. లంచం ఇవ్వనిదే ఎవరికీ పనిచేయని దుస్థితి ఉంది. ఆ విషయాన్ని సుప్రీం కోర్టు కూడా శుక్రవారం తాజాగా ప్రస్తావించింది. క్యాన్సర్ మాదిరిగా సమాజాన్ని అవినీతిపరులైన ఉద్యోగులు తొలిచేస్తున్నారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

రెండేళ్ల పాటు నెలవారీ జీతాలు ..

ఏపీలో అవినీతి, అక్రమాలకు కొదువలేదు. రెండేళ్లుగా కరోనా సమయంలో ఉద్యోగులు ఇంటి పట్టున(కొందరు మినహా) ఉంటూ క్రమం తప్పకుండా జీతాలు తీసుకున్నారు. ఆ సమయంలో దినసరి కూలీలకు పనిలేక పస్తులు ఉన్నారు. తినడానికి తిండి కూడా దొరకని కూలీలు అనేక మంది అప్పుడు బాధపడ్డారు. కానీ, ఉద్యోగులు రెండేళ్ల పాటు నెలవారీ జీతాలను లక్షల్లో తీసుకున్నారు. పనిచేయకుండా ఇంత జీతం ఎందుకని ఉద్యోగులు ఎవరూ అనలేదు. కనీసం దినసరి కూలీలను ఆదుకుందామన్న ఆలోచన చేసిన ఉద్యోగులు కనిపించలేదు. కానీ, ఇప్పుడు జీతాలు సకాలంలో అందలేదని దినసరి కూలీలను కించపరిచేలా ఉద్యోగ సంఘం నాయకుడు శ్రీనివాసరావు మాట్లాడం వాళ్ల ఆధిపత్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రజలపై సుమారు రూ. 10వేల కోట్లకు పైగా భారం పడుతుందని తెలిసి కూడా ఈ ఏడాది తొలి క్వార్టర్ లో జీతాలు పెంచే వరకు వదల్లేదు. కరోనా కారణంగా ప్రజలు ఆర్థిక చితికిపోయారని ఏ మాత్రం ఆలోచన చేయలేదు. జీతాలను పెంచే వరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి మెడలు వంచారు. ఆనాడు ప్రభుత్వాన్ని `పడగొట్టగలం` అంటూ హెచ్చరించారు. దానితో తలొగ్గిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయిప్పటికీ జీతాలను పెంచారు. ఇప్పుడు మళ్లీ కొత్త పీఆర్సీ కోసం డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి తరువాత తఢాఖా చూపిస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. `కూలీల కంటే హీనం..` అంటూ అసంఘిటితంగా ఉన్న నిరుపేదలను కించపరుస్తూ కామెంట్లు చేయడాన్ని ఉద్యోగ సంఘాల నాయకుల విజ్ఞతకు వదిలేయాల్సిందే. 

Post a Comment

Previous Post Next Post