Trishul News

తాగునీటి పారిశుద్ధ్యంపై అవగాహన పెంచండి - నెల్లూరు కమిషనర్ హరిత

నెల్లూరు, త్రిశూల్ న్యూస్ :
పరిశుభ్రమైన తాగునీటి వినియోగంతోనే ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యపడుతుందని, ప్రజలందరికీ పారిశుధ్యంతో పాటు మంచినీటి పరిశుభ్రతపై అవగాహన పెంచాలని నగర పాలక సంస్థ కమిషనర్ హరిత తెలిపారు. "యూనిసెఫ్ - సార్డ్స్ - నవజీవన్" సంస్థల సంయుక్తాధ్వర్యంలో "పట్టణ నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత" అనే అంశాలపై కార్పొరేషన్ కార్యాలయంలోని పురసేవ సమావేశ మందిరంలో శుక్రవారం కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు, ఆరోగ్య మిత్ర వలంటీర్లు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ హాజరై మాట్లాడుతూ నగర వ్యాప్తంగా మంచినీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఉత్తమ ప్రణాళికలను సిద్ధం చేశామని తెలిపారు. ప్రతీ ఇంటికీ తాగునీటి కుళాయి కనెక్షన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, తాగునీటి స్వచ్ఛతకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని కమిషనర్ తెలిపారు. రాబోయే రోజుల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా విస్తృత స్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపట్టి నగరాన్ని సుందరంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. నగరంలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించేందుకు సాయం చేస్తున్న ఏ.ఐ.ఐ.బి బ్యాంక్ వారికి, పట్టణ నీటి సరఫరా & పారిశుద్ధ్య నిర్వహణ సంస్థలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కమిషనర్ వెల్లడించారు. ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ఈ.ఈ సంజయ్, డి.ఎమ్.హెచ్.ఓ డెమో అధికారి శ్రీనివాసరావు, నవజీవన్ సంస్థ డైరెక్టర్ సహదేవయ్య తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post