Trishul News

ఎమ్మెల్యేలపై సీఎం జగన్‌ సీరియస్‌..?

అమరావతి, త్రిశూల్ న్యూస్ :
నేడు సీఎం జగన్‌ గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. పనితీరు ఆధారంగా కొందరు ఎమ్మెల్యేలకు సీఎం జగన్‌ మందలించినట్లు తెలిసింది. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కురసాల కన్నబాబు వివరణ ఇచ్చారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయవద్దని సీఎం స్పష్టం చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమ లక్ష్యాలను అందుకోవడంలో వెనుకబడిన కొందరు ఎమ్మెల్యేలకు మార్చి వరకు గడువు నిర్దేశించారని తెలిపారు కన్నబాబు. ‘గడప గడపకు’ కార్యక్రమంపై మార్చిలో వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు సీఎం చెప్పారని, అప్పట్లోగా పనితీరు మార్చుకోవాలని సదరు ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారని వివరించారు కన్నబాబు. గతంలో సెప్టెంబరు 29న ఈ కార్యక్రమంపై సమీక్ష జరగ్గా, ఇప్పటికి 78 రోజులు గడిచాయని, అందులో 40 రోజులు ‘గడప గడపకు’ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉందని అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు ఎక్కువ రోజులు కేటాయించలేకపోయారని, మరికొందరు ఎక్కువ సమయం పాల్గొనలేకపోయారని, ఈ విషయాన్ని గుర్తించిన సీఎం వారికి ఎక్కువ రోజులు, ఎక్కువ సమయం గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారని వెల్లడించారు కన్నబాబు. ఎన్ని పనులు ఉన్నా, వాటితో పాటే ఈ కార్యక్రమం కూడా జరిగి తీరాలన్న సంకల్పంతో ముందుకు కదలాలని నిర్దేశించారని వివరించారు. మనం ఇన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతే, వాటిలోని లోపాలను ప్రజల నుంచి తెలుసుకోకపోతే ఫలితం ఉండదని సీఎం అభిప్రాయపడ్డారని తెలిపారు కన్నబాబు.

Post a Comment

Previous Post Next Post