Trishul News

రాష్ట్రంలో ఉత్తమ పాలనకు ఎన్టీఆర్‌ సృష్టికర్త - చంద్రబాబు

మంగళగిరి, త్రిశూల్ న్యూస్ :
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా పలువురు టీడీపీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు.. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే రాజకీయాల్లో ముందుకెళ్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లోని యువతను ఎన్టీఆర్‌ ప్రోత్సహించారన్న బాబు.. యనమల వంటి యువకులకు అవకాశాలిచ్చారని తెలిపారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు 27వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో ఎన్టీఆర్​ విగ్రహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు.. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సింగిల్‌ విండో విధానంతో ఎన్టీఆర్​ వ్యవసాయాన్ని ఆదుకున్నారని గుర్తు చేశారు. జగన్‌ పాలనతో ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోయిందని విమర్శించారు. అమ్మఒడి అని చెప్పి పాఠశాలలకు పార్టీ రంగులు వేసుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉత్తమ పాలనకు ఎన్టీఆర్‌ సృష్టికర్త అని కొనియాడారు. ఉత్తమ విధ్వంసకారుడు జగన్‌మోహన్‌రెడ్డి అని విమర్శించారు. భావితరాల భవిష్యత్తు కోసం ఎన్టీఆర్ తపించారన్న బాబు.. నేడు భావితరాల భవిష్యత్తు గోదావరి పాలైందని ధ్వజమెత్తారు. సైకో సీఎం చేతిలో రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సంక్షేమం లేదు... సంక్షోభంలో రాష్ట్రం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, ఇతర నేతలు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post