Trishul News

గుడుపల్లెలో పూలహారానికి కూడా నోచుకోని పేదల దైవం ఎన్టీఆర్ సమాధి..!

- చంద్రబాబు గుండెలో పేదల దైవం ఎన్టీఆర్ లేరా..?

- అన్నగారి విగ్రహానికి నోచుకోని గుడుపల్లె మండల కేంద్రం

- విగ్రహం ఏర్పాటు చేయకపోవడంపై తెలుగు తమ్ముళ్లలో నిరాశ

- నవ్వుకుంటున్న రాజీవ్, ఇందిరా గాంధీలు, వైస్సార్ సమాధులు
కుప్పం, త్రిశూల్ న్యూస్ :
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థపాకులు నందమూరి తారకరామారావు వర్ధంతి రోజున ఘోర అవమానం జరిగింది. అక్కడక్కడ చిత్ర పటాలకు పలువురు శ్రద్ధాంజలి ఘటించినా.. కుప్పం - గుడుపల్లె జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎన్టీఆర్ సమాధి వీరికి కనపించక పోవడం శోచనీయం. సమాధిపై పిచ్చి మొక్కలు మొలిచి, చెత్తచెదారం పేరుకుపోయింది. ప్రపంచ దేశాలలోని తెలుగు వారితో సైతం అన్న గారు అని గౌరవంగా పిలుచుకునే ఎన్టీఆర్ కు చంద్రబాబు స్వంత నియోజకవర్గంలో మాత్రం ఆదరణ కరువైయింది.

చిత్రపటాలకు తప్ప.. విగ్రహాలకు ఎప్పుడు నివాళులు అర్పిస్తారు..?
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చంద్రబాబు స్వంత నియోజకవర్గం ఇక్కడ నుంచి గత 35ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 1996 జనవరి 18న స్వర్గీయ నందమూరి తారకరామారావు అకాల మరణం చెందిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి నుంచి మూడు సార్లు ముఖ్యమంత్రిగా గత 6సార్లు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు తిరుగులేని మొజారిటితో గెలుస్తూ వస్తున్నారు. అయితే ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ఉన్న ప్రేమను మాత్రం చాటలేకపోతున్నారు. అందుకు నిదర్శనం గుడుపల్లె మండలం. ప్రతి పర్యటనలో గుడుపల్లె నా గుండెకాయ అని చెప్పుకునే చంద్రబాబుకు ఇంతవరకు ఎందుకు గుడుపల్లె మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయలేదన్నది ఆయన మనసుకే ఎరుక. కుప్పం నియోజకవర్గంలో కుప్పం, శాంతిపురం, రామకుప్పం మండల కేంద్రాల్లో మాత్రమే ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు. గుడుపల్లె మండలంలో మాత్రం ఒక్క విగ్రహం ఏర్పాటు చేయలేకపోయారు. స్థానిక నేతలను అపుడప్పుడు కార్యకర్తలు పలువురు అడుగుతూనే ఉంటారు కానీ ద్రావిడ విశ్వవిద్యాలయం నందు ఉంది కదా అంటూ మాట దాటవేస్తున్నారు. నిజానికి ద్రావిడ యూనివర్సిటీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు కాబట్టి ద్రావిడ వారు తమ క్యాంపస్ నందు విగ్రహం ఏర్పాటు చేసుకున్న విషయం జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ మరణం తరువాత ఇంతవరకు ఒక్క ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయలేదు అంటే తెదేపా నేతలకు ఎన్టీఆర్ పై ఎంత అభిమానమో ఇట్టే అర్ధం అయిపోతోంది.

మొక్కుబడిగా ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన తెదేపా శ్రేణులు..!
నేడు నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహిస్తుంటే గుడుపల్లె మండలంలో మాత్రం ఏదో మొక్కుబడిగా మమ అనిపించారు. ముందుగా ద్రావిడ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గుడుపల్లె మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో చిత్ర పటానికి నివాళులు ఘటించారు. అయితే కుప్పం - గుడుపల్లె ప్రధాన రహదారిలోని ద్రావిడ యూనివర్సిటీ క్రాస్, వెంగేపల్లె సమీపంలో అప్పట్లోనే ఎన్టీఆర్ పై అభిమానంతో సమాధి నిర్మించారు. అప్పటినుండి ప్రతి ఏటా ఎన్టీఆర్ వర్ధింతి, జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. అయితే గత రెండేళ్లగా పూజలకు నోచుకోక సమాధిపై పిచ్చిమొక్కలు మొలిచి, చెత్తచెదారం పేరుకుపోయి సమాధి ఉన్న విషయమే మర్చిపోయారు. రోజూ కాకపోయినా కనీసం ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి రోజున కూడా ఒక్క పూలుహారం కూడా వేయకపోవడం తెదేపా నేతల నిర్లక్ష్యానికి నిదర్శనం.

నవ్వుకుంటున్న రాజీవ్, ఇందిరా గాంధీలు, వైస్సార్ సమాధులు..!
ఎన్టీఆర్ సమాధి అనుకొనే మాజీ దేశ ప్రధానులు స్వర్గీయ రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి సమాధులు ఉన్నాయి. ప్రతి ఏటా కాంగ్రెస్, వైస్సార్సీపీ నేతలు వారి వారి నేతల సమాధులకు పూజలు నిర్వహిస్తున్నారు. పక్కనే తెలుగుదేశం పార్టీకి ముగ్గురు బద్ద శత్రువుల సమాధుల మధ్యలో ఉన్న ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కి పూజాపురస్కారాలు లేక  అయన ఆత్మ ఎంత క్షోభకు గురవుతుందోనని చుట్ట ప్రక్కల గ్రామీణ ప్రజలు చర్చికుంటున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎన్టీఆర్ సమాధి తెలుగుదేశం నాయకులకు గుర్తు రాకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా గుడుపల్లె టిడిపి నేతలు నిర్లక్ష్యం విడనాడి మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని టిడిపి కింద స్థాయి కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు కోరుతున్నారు.

Post a Comment

Previous Post Next Post