Trishul News

సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద ఘటనకు షార్ట్‌ సర్య్కూట్‌ కారణం కాదు..!

హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
సికింద్రాబాద్‌ మినిస్టర్‌ రోడ్డులోని షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు షార్ట్‌ సర్య్కూట్‌ కారణం కాదని విద్యుత్‌ శాఖ అధికారి శ్రీధర్‌ తెలిపారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో కొద్ది మీటర్ల దూరంలో విద్యుత్‌ సరఫరా ఉందన్నారు. ఒకవేళ షార్ట్‌ సర్య్కూట్ జరిగి ఉంటే సబ్ స్టేషన్‌లో ట్రిప్‌ అయ్యేదని.. కానీ అలా జరగలేదని ఆయన వివరించారు. గురువారం ఉదయం 11.20 గంటలకు సమాచారం అందగానే విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. చుట్టుపక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని తెలిపారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే మీటర్లు, వైర్లు పూర్తిగా కాలిపోయేవని చెప్పారు. భవనానికి మొత్తం 6 మీటర్లు ఉన్నాయన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలేంటనేది దర్యాప్తులో తేలుతుందని శ్రీధర్‌ చెప్పారు.

డ్రోన్‌ సాయంతో గాలింపు..

భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో స్వల్పంగా ఉన్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో భవనం పూర్తిగా దెబ్బతింది. భవనం లోపలి పరిస్థితిని అంచనా వేయడానికి అగ్నిమాపక శాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు డ్రోన్‌ ఉపయోగించారు. ప్రమాదం జరిగిన సమయంలో దుకాణంలో 17 మంది ఉన్నారని.. మంటలు వ్యాపించడాన్ని గుర్తించి వీరంతా ముందుగా బయటకు వచ్చారని అధికార వర్గాలు చెబుతున్నాయి. దుకాణంలో ఉన్న సామాను తీసుకురావడానికి మళ్లీ లోపలికి వెళ్లి ముగ్గురు చిక్కుకుపోయారని తెలిపాయి. గుజరాత్‌లోని సోమనాథ్ జిల్లా వెరావల్ గ్రామానికి చెందిన గ్రామస్థులు జునైద్(25), జహీర్(22), వసీం(32)గా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ముగ్గురి పరిస్థితి గురించి కూడా అధికారులు డ్రోన్‌ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు అగ్నిప్రమాదం జరిగిన భవనం యజమాని జావేద్‌ పరారీలో ఉన్నట్లు సమాచారం.

Post a Comment

Previous Post Next Post