Trishul News

ఎన్టీఆర్ జిల్లాలో విచిత్రం.. రోడ్డుపై ఉబికివస్తున్న ఎర్రటి ద్రవం..!

పెనుగంచిప్రోలు, త్రిశూల్ న్యూస్ :
ఎన్టీఆర్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఎక్కడ నీళ్ళు పోసినా రక్తం లాంటి ఎర్రటిద్రవం ఉబికి వస్తున్న పరిస్థితి వారిని ఆందోళనకు గురిచేస్తుంది. పెనుగంచిప్రోలు మండలం శనగపాడు ఎస్సీ కాలనీలో ఉన్న సిమెంట్ రోడ్డుపై నీళ్లు పోస్తే రక్తం లాంటి ఎర్రటి ద్రవం బయటకు వస్తుంది. అది ఏదో ఒకసారి మాత్రమే జరుగుతున్నది కాదు.. ఎప్పుడు ఆ రోడ్డుపై నీళ్ళు పోసినా రక్తం లాగా ఎర్రటి ద్రవం ఉబికి వస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఏం జరిగిందో అర్థం కాక రాత్రులు కంటిమీద కునుకు లేకుండా బ్రతుకుతున్నారు.


రోడ్డుపై ఉబికివస్తున్న రక్తం వంటి ద్రావణం.. కొత్త భయంలో జిల్లా వాసులు
ఇక రోడ్డుపై రక్తం వంటి ద్రవం ఉబికి వస్తున్న ఘటన పై పెద్ద ఎత్తున రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఎవరో చేతబడి చేశారని.. చేతబడి వల్ల ఇలా జరిగిందని, దీనివల్ల తమకందరికీ హాని చేకూరుతుందని పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఎక్కడ నీళ్ళు పోసినా రక్తం బయటకు వస్తుందంటూ, ఎవరికి ఏమి జరుగుతుందో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు. అయితే కొందరు రోడ్డు వేసినప్పుడు వినియోగించిన కెమికల్స్ వల్ల ఇలా జరుగుతుందని, దీనికి భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.

చేతబడి భయాలు.. వచ్చి చూస్తున్న చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు
కానీ మూఢనమ్మకాలను నమ్ముతున్న మరికొందరు ఎవరో చేతబడి చేశారని అందువల్లే ఇలా జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. అసలు ఎందుకు రోడ్డుపై ఎక్కడ నీళ్ళు పోసినా రక్తం వంటి ద్రావణం బయటకు వస్తుంది అన్నది తేల్చాలని, దానికి కారణాలను అన్వేషించాలని వారు అధికారులను కోరుతున్నారు. తమ భయాందోళనలను దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే స్పందించి విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి వచ్చి, రోడ్డుపై నీళ్లు పోసి మరి బయటకు వస్తున్న ఎర్రటి రక్తం వంటి ద్రావణాన్ని పరిశీలిస్తున్నారు.

అధికారులు ఈ వింత వెనుక కారణాలను పరిశీలించాలని విజ్ఞప్తి
 
కొందరు అదేమిటో విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ విచిత్రమైన సంఘటనకు గల కారణాలను అధికారులు తేల్చకపోతే రకరకాల ఊహాగానాలతో ప్రజలు భయాందోళన చెందే అవకాశం ఉంటుంది. దీనిపై జిల్లా వ్యాప్తంగా మూఢ నమ్మకాలు ప్రబలక ముందే అధికారులు దీని వెనుక ఉన్న కారణాలను చెప్పాల్సి ఉంటుంది.

Post a Comment

Previous Post Next Post