Trishul News

ఓటుతోనే ప్రజామోదం పొందిన మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది - కలెక్టర్

- ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత

- జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన బైక్ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి 25న జరగబోతున్న నేపథ్యంలో ప్రతి పౌరుడు ఓటర్ గా నమోదు చేసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన బైక్ ర్యాలీని పాత మునిసిపల్ కార్యాలయం నుండి జెండా ఊపి జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం ర్యాలీని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్ 2023 అనేది గత సంవత్సరం ఎవరైతే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ వెరిఫై చేసిన అనంతరం ప్రతి సంవత్సరం జనవరి 5న ఓటరు జాబితా ప్రచురిస్తామని అన్నారు. కొత్తగా ఎవరైతే ఓటరుగా నమోదై ఉంటారో వారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు జనవరి 25వ తేదీన నేషనల్ ఓటర్స్ డే రోజున ఓటరు ఐడి కార్డులు అందజేస్తామని అన్నారు. ఈ అవగాహన ర్యాలీ, ఇతర కార్యక్రమాలు 18 సం. లు నిండిన ప్రతి ఒక్క పౌరుడు ఓటరు గా నమోదు చేసుకోవాలని, ఎవరు కూడా మిగిలి పోకుండా అందరు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టే దిశలో స్వీప్ ప్రోగ్రాం కింద చేపట్టడం జరుగుతోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కూడా 18, 19 సం. నిండిన యువత ఇంకనూ ఓటరుగా నమోదు కాని వారు ఉన్నారని, వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
యువత దేశానికి వెన్నెముక అని, వారు ఓటు హక్కు పొందితే సరైన నాయకులను ఎన్నుకుంటారని, దానివలన సరైనటువంటి ప్రజామోదం పొందిన ప్రభుత్వం వస్తుందని తద్వారా భారతదేశం ప్రపంచ దేశాల్లో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయ పడ్డారు. కాబట్టి యువత ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాల్సిన అవసరం ఉందనీ, ఎప్పుడైనా ఏ రోజైనా ఓటరుగా అప్లై చేసుకోవచ్చని వెరిఫికేషన్ అనంతరం ఓటరుగా అర్హత ఉన్నట్లయితే వాళ్లందర్నీ కూడా మనం ఓటర్స్ గా నమోదు చేయడం జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. కావున ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలిగితే రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి అవకాశం యువతకు అందుబాటులో ఉంటుందని అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం రోజున ఓటరు కార్డులు అందజేయడం జరుగుతుందని, ఆ తర్వాత కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి వెరిఫికేషన్ అనంతరం అర్హత మేరకు వారి ఇళ్లకే ఓటరు కార్డులు పంపబడతాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి అర్బన్ తాసిల్దార్ వెంకటరమణ, ఆర్ ఐ రామచంద్రా రెడ్డి, వివిధ శాఖల అధికారులు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post