Trishul News

జన ఘోషను రణఘోషగా మార్చిన కలియుగ దేవుడు ఎన్టీఆర్..!

- సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లుగా శంఖారావం పూరించిన పేదల పెన్నది 

- విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు
త్రిశూల్ న్యూస్, ప్రత్యేక కథనం :

జన ఘోషను రణఘోషగా మార్చాడు. ఆక్రోశాన్ని ఆవేశంగా మలిచాడు. ప్రజాగ్రహం.. ధర్మాగ్రహమైంది. చక చక చక చైతన్య రథం తెచ్చి .. ఆత్మగౌరవాస్త్రం సంధించాడు. తెలుగు నేలమీద సడి లేని.. నిశ్శబ్ధ రాజకీయ విప్లవం తెచ్చాడు. తొమ్మిది మాసాల తన పార్టీతో.. నూరేళ్ల పార్టీని చాపచుట్టి సుడిగుండంలో పడేశాడు. నవ రాజకీయానికి తెరతీశాడు. నాడు ఆరుకోట్ల ఆంధ్రుల అండతో ఓట్ల సునామీ సృష్టించిన.. నవ చరిత్రకారుడు, చండశాసనుడు, అనితర సాధ్యుడు, అసాధ్యుడు, ఒకే ఒక్కడు.. నటరత్న నందమూరి తారక రామారావు. తెలుగుదేశాధిపతి, చైతన్య రథ విహారి, రాష్ట్ర సారథిగా ప్రమాణం చేసి నేటికి నలభై వసంతాలు. తెలుగు నేల అతడి వెంట నడిచింది. నలువైపులా జనవాహిని పరవళ్లు తొక్కింది. చైతన్య రథ సారథికి చెయ్యెత్తి జేకొట్టింది. గతమెంతో ఘనకీర్తి కల వెండితెర ఆరాధ్యుణ్ణి.. రాజకీయ యవనిక మీద అన్నగారిగా అభిమానించి.. హృదయ పూర్వకంగా స్వాగతించింది. ఎటు వెళితే అటు జన సందోహం.. పోటెత్తి.. 'ఓటెత్తి'. మహా నాయకుడికి ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు. ఈ ధరిత్రి మీద నూరేళ్ల చరిత్ర కలిగిన పార్టీనే.. మట్టి కరిపించిన ఆ చరితార్ధుడు నందమూరి తారకరామారావు. ప్రజాక్షేమం కోసం సాహసాలు చేసిన సంక్షేమ రాముడి.. అలనాటి ప్రజా పట్టాభిషేకానికి నేటికి నలభై ఏళ్లు.'నందమూరి తారక రామారావు అను నేను ..'అని.. ఆయన మొట్టమొదట ప్రజా సమక్షంలో చేసిన ప్రమాణాన్ని జగమంతా ఆలకించింది. జనమంతా ఆస్వాదించారు. ఆనాటి అపురూప ఘట్టానికి నేటికి 40 ఏళ్లు. తెలుగుదేశం పార్టీ పెట్టి ..దుష్పరిపాలనకు కారణాలు కనిపెట్టి.. వాటి పనిపట్టాడు. 97 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్​ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టాడు. సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగిన అపూర్వ వెండితెర అభినవ రాముడు.

ఎన్టీఆర్ ఈపేరు వింటేనే ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారి ఆత్మగౌరవం ఉప్పొంగుతుంది. పేరెన్నికగన్న మహానటులు సైతం ఎన్‌.టి. రామారావు నటించిన పాత్రల డైమన్షను చూసి...ఆ పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసే ఆయన నటనా సరళిని చూసి సంభ్రమాశ్చర్యాలతో నివ్వెరపోతుంటారు. అందుకే నటరత్న, విశ్వవిఖ్యాత నటనా సార్వభౌమ లాంటి బిరుదులు ఆయన మూర్తి ముందు వెలవెలలాడి పోతుంటాయి. నిజానికి ఆయన భారతరత్నం. ఆయన జీవితంలో కొన్ని విశేషాలు....
చెన్నై త్యాగరాయ నగర్‌లో బజుల్లా రోడ్డులో... లక్ష్మీనిలయం ఆయన నివాసం. అందరికీ ఆరు గంటలకి తెల్లవారితే లక్ష్మీ నిలయంలో మూడు గంటలకే భళ్లున తెల్లారుతుంది. ''లక్ష్మీ నిలయం'' ప్రాంగణం లోపల ఎన్‌.టి.ఆర్‌ పచార్లు. ఇంతలో ఒక అంబాసిడర్‌ కారు... ఆ కారులోంచి వాహినీ వారి పహిల్వాన్‌. ఈ పహిల్వాన్‌ కేవలం ముగ్గురికే మసాజ్‌ చేస్తాడు. ముందు ఎన్‌.టి.ఆర్‌.కి తరువాత త్రివిక్రమ రావుకి, ఆ తరువాత నాగిరెడ్డికి. ఇంతే ఆయన డ్యూటీ. కండలు తిరిగిన శరీరం. రాజరికపుటలవాట్లను తలపింపచేసే టర్బన్‌. చేతిలో ములుకర్ర.. చూడ్డానికి వింతగా ఉండేవాడు. చూడాలనిపించేలా వుండేవాడు. రామారావు గోచి కట్టుకొని పడుకుంటే.. గుర్రాలకు పట్టే స్కార్ఫ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేసేవాడు. పహిల్వాన్‌ చెయ్యి పడిందంటే ఒళ్ళంతా మువ్వలా అయిపోవాల్సిందే. తరువాత అభ్యంగన స్నానం.. ధవళ వస్త్ర ధారణ. ఎన్‌.టి.ఆర్‌ దర్బార్‌లో ఉచితాసనం అలంకరించడం. ఒక లీటరు బాదం, పిస్తా, కుంకుమ పువ్వు కలిపిన పాలు సేవించాక కథా చర్చలో పాల్గొనేవారు. ఎన్‌.టి.ఆర్‌.గురించి చాలా మందికి తెలియని విశేషమైన గుణం ఉంది. ఆయన దేన్నీ పట్టించుకోనట్లు ఉంటారు గాని ప్రతి అంశాన్ని మైక్రోస్కోపిక్‌ లెన్స్‌లో చూస్తారు. సమయపాలన ఆయన ఆరో ప్రాణం. ఉదయం నాలుగున్నరికి కలుద్దాం బ్రదర్‌ అంటే ఆ సమయానికి ఆయన కుర్చీలో సిద్ధంగా వుంటారు. సంబంధిత సమాచారంతో కలుసుకోవలసిందే. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం. పంక్చువాలిటీకి ప్రాణమిస్తారు. ఆయనకి మంచి ధారణ శక్తి ఉంది. కిందటి రోజున ఏ సందర్భంలో చర్చ ఆగిపోయిందో సరిగ్గా అక్కడి నుంచే చర్చ ప్రారంభించేవారు. ఆయన సునిశిత పరిశీలన గురించి ఓ విషయాన్ని చెప్పాలి. హీరో తన ఫ్రెండ్స్‌తో కలిసి క్లబ్‌కి వెళతాడు. మందు తాగుతుంటారు. ఇంతలో ప్రతి నాయకుడు కనిపిస్తాడు. దానికి ఆయన పక్కనే పెన్సిలుతో ''హీరో ఫ్రెండ్స్‌ మందు తాగవచ్చును. హీరో మందు తాగుతున్నట్లు నటించి పక్కనే వున్న ఫ్లవరు వాజులో పారబోయవలయును'' ముత్యాల్లాంటి అక్షరాలతో సున్నితంగా సవరించేవారు. కథలో హీరోతో సమానంగా ప్రతి నాయకుడ్ని స్వీకరించేవారు. విలన్‌ అని రాస్తే ప్రతి నాయకుడు అని సరిదిద్దేవారు. హీరో అనేవాడు భావితరాలకు స్ఫూర్తిదాయకంగా వుండేవాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదు అనేవారు. ఆయన స్క్రిప్ట్‌ని ఫైనలైజ్‌ చేసే విధానం చిత్రంగా వుంటుంది. స్క్రిప్ట్‌ పూర్తయ్యాక యూనిట్‌ని పిలిచి కవిగారి చేత చదివి వినిపించేవారు. వారి స్పందనను నిశితంగా పరిశీలించేవారు. ఒకరికి తెలియకుండా మరొకరి అభిప్రాయాలను కూడా సేకరించేవారు. ఆ స్క్రిప్ట్‌ తృప్తిగా అనిపిస్తే పక్కన పెట్టేవారు. మళ్ళా ఆరు మాసాల తర్వాత మరో షూటింగ్‌ అప్పుడు కూడా అదే స్పందన అదే ఆనందం యూనిట్‌ బృందం వ్యక్తపరిస్తే అప్పుడు ఆ స్క్రిప్ట్‌ని చిన్నాయనకిచ్చి చదివి బైండు చెయ్యమనేవారు. చిన్నాయన అంటే త్రివిక్రమరావుగారు.
ఎన్‌.టి.ఆర్‌. ఇంట్లో ఆడిటర్‌ ప్రత్యేకించి వుండడు. ఫైల్సు, పేడ్స్‌, పేపర్స్‌, బైండ్‌ బుక్‌ అన్నీ స్వయంగా త్రివిక్రమరావు తయారు చేస్తారు. వారు వాడుతున్న ''సిరా'' సైతం చిన్నాయన స్వయంగా కరక్కాయ రంగు సిరా తయారు చేసి సీసాల నిండా నింపేవాడు. వయిలెట్‌ కలర్‌ ఇంక్‌ వాడేవారు. ఒకసారి ఆంధ్రా బ్యాంకు మేనేజర్‌ ఇంటికి వచ్చి ''అయ్యా.. రూల్సు మారాయి.. మీరు ఆ సిరాతో చెక్కులు రాస్తే స్వీకరించలేము!'' అంటూ సవినయంగా మనవి చేశాడు. స్వీకరించకపోతే శెలవు తీసుకోండి.. మరో బ్యాంకు వారికి అవకాశం కల్పిస్తాం అన్నారు. చేసేది లేక నందమూరి సోదరులకు మినహాయింపు ఇచ్చారు. అయిదున్నర గంటలకు మేకప్‌మేన్‌ పీతాంబరం లేదా ఆయన సహాయకుడు ముత్తు వచ్చేవాడు. కాస్ట్యూమర్‌ మోక రామారావు ఆయన అసిస్టెంట్‌ బాబూరావు, డ్రైవర్‌ కృష్ణ అంతా సిద్ధంగా ఉండేవారు. మేకప్‌ని ఓ పవిత్రమైన కార్యంగా భావించేవారు. బొట్టు పెట్టగానే ఆ నటరాజస్వామిని తలచుకుంటూ మౌనంగా ధ్యాన ముద్రలో వుండిపోయేవారు. పౌరాణిక చిత్రాల్లో కృష్ణుడు, రాముడు, రావణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, భీష్ముడు ఏ పాత్రలు వేసినా మాంసాలకు దూరంగా ఉండేవారు. సహ నటులను కూడా అంతే నిష్ఠగా ఉండమని చెప్పేవారు. మేకప్‌ వేసుకున్నది మొదలు షూటింగు పేకప్‌ చెప్పేటంత వరకూ అలంకారం తీసేవారు కారు. ఆ బరువు మోసి తీరవలసిందే. ప్రతిరోజు ఓ అరగంట సమయం నిర్మాతల కోసం కేటాయించేవారు. నిర్మాతల యోగ క్షేమాల్ని అడిగి తెలుసుకోనేవారు. ఆయన తరచు అంటుండేవారు ''బ్రదర్‌ ఈ లోకంలో ఎవడు చెడ్డ తెలివితేటలు ఎక్కువై చెడడు. అమాయకుడు, నిజాయితీపరుడు ఎప్పుడూ చెడిపోలేదు. చేసిన తప్పులు దిద్దుకోవడం గొప్పతనం. అటువంటి వారికే నా దగ్గర చోటు!'' అనేవారు. తిరుపతి వెళ్ళొచ్చిన టూరిస్టు బస్సులన్నీ ఎన్‌.టి.ఆర్‌ ఇంటి ముందే ఆగేవి. ఒక పది బస్సులు పోగయ్యాక బైటికి వచ్చి అందర్నీ ప్రేమగా పలకరించి కుశల ప్రశ్నలు వేసి ఆ అభిమానులకు తనివితీరేలా మాట్లాడేవారు. రైతులు వస్తే నాట్లు వేసింది మొదలు కోతల వరకు సమాచారం అడిగి తెలుసుకొనేవారు. వ్యవసాయం దిగుబడి మీద మంచి అవగాహన వుండేది. ఎనిమిదిన్నరయితే షూటింగ్‌కి బయల్దేరేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండేవారు. ఆయన బైటికి వచ్చినప్పుడు వాకిలికి ఇరువైపుల సింహాలు మధ్యలో రారాజులా కనిపించేవారు. బసవ తారకమ్మ ఎదురొచ్చేవారు. పుండరీకాక్షయ్య, బలరామయ్యలు ఎస్కార్ట్‌లుగా ఉండేవారు. ఎన్‌.టి.ఆర్‌. బావమరిది రుక్యాందరావు ఆగమేఘాల మీద ఎన్‌.టి.ఆర్‌ ఆదేశాల్ని అమలు చేసేవాడు. ఎన్‌.టి.ఆర్‌. దగ్గర ఏ వ్యవహారం అయినా 'క్రియ' ప్రధానంగా వుండి తీరాలి. రిజల్ట్‌ ఓరియంటెడ్‌గా ఉండాలి.
సెట్‌లో ఎన్‌.టి.ఆర్‌. పని చేసే విధానం నేటి తరానికి ఆదర్శం. ఫ్లోర్‌లో అడుగుపెట్టింది మొదలు లంచ్‌ బ్రేక్‌ వరకూ తనూ కూర్చోరు.. యూనిట్‌లో ఎవర్నీ కూర్చోనివ్వరు. పని.. పని.. పని ప్రొడ్యూసరు పెట్టిన ప్రతి రూపాయికి నటీనటులు సాంకేతిక నిపుణులు జవాబుదారీగా ఉండాలన్నది ఆయన సంకల్పం. సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ స్నానపానాదులు ముగించి మళ్ళీ దర్బారులో కూర్చుంటారు. వరుసగా ప్రొడ్యూసరు బాగోగులు, కొత్త సినిమాకు సంబంధించిన కథలూ మధ్య మధ్యలో వేడివేడి పకోడీలు, వేరుశెనగకాయలు, పప్పు, బెల్లం, స్వీట్లు అయితే తిరుపతి కళ్యాణం లడ్డు, తిరుపతి జిలేబీ, తాపేశ్వరం కాజా, కాకినాడ కాజా, బందురు లడ్డూ, ఆత్రేయపురం పూతరేకులు అన్నీ స్పెషల్‌ ఐటమ్స్‌ చోటు చేసుకునేవి. కేవలం ఎన్‌.టి.ఆర్‌ని ఆశ్రయించుకుని కొంతమంది నటీనటులూ సాంకేతిక నిపుణులు ఉండేవారు. వారి స్థితిగతులను తెలుసుకొని అక్కడికక్కడే వారి సమస్యను పరిష్కారం చూపించేవారు.
ప్రబంధ కవులందర్నీ చదివారు. సమకాలీన సాహిత్యం మీద మంచి పట్టు ఉంది. పోతన గురించి ఎంత అనర్గళంగా మాట్లాడగలరో శ్రీశ్రీ గురించి అంతే సున్నితంగా చెప్పగలరు. ఎన్‌.టి.ఆర్‌. పాత్రలను చదివి నెమరు వేసుకోవడం గాకుండా ఆ పాత్రలను పరిశోధన చేసి ఇలాగే ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండకూడదు అని రీసెర్చ్‌ చేసి అప్పుడు ఆయా పాత్రలను ఆవిష్కరించేవారు. ఎన్‌.టి.ఆర్‌. ది కె.వి రెడ్డి స్కూలు. కె.వి.రెడ్డి మీద అపారమైన భక్తి విశ్వాసాలున్నాయి. ఒకరోజు రెడ్డిగారు వచ్చి నువ్వు నాకు సహాయం చెయ్యాల అన్నాడు! ఎన్టీఆర్‌ తన కళ్ళను నమ్మలేకపోయారు. అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు. ఆ ఏర్పాట్లు నువ్వు చెయ్యాలప్పా! వూరికే చెయ్యనవసరం లేదు నేనే నీకో సినిమా చేెసిపెడతాను! అన్నాడు. అంతటి ఆత్మభిమానం గల వ్యక్తి కె.వి.రెడ్డి ''సినిమా సంగతి తర్వాత చూద్దాం. ముందు బాబు అమెరికా ఏర్పాటు తమ్ముడు చూస్తాడు. మీరు నిశ్చింతగా ఉండండి!. అంటూ ఆ ఏర్పాట్లు చూడమని తమ్ముడికి చెప్పారు. అందుకు గాను కె.వి.రెడ్డికి'' శ్రీకృష్ణ సత్య'' చిత్రం దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. గురుశిష్యులు మధ్య అంతటి అవినాభావ సంబంధం ఉంది. అలాగే ఘంటసాల మాస్టార్‌ విషయంలోనూ నందమూరి సోదరులు ఉదార స్వభావాన్ని చూపించి పారితోషికం పెంచారు. నిలయ విద్వాంసులుగా టి.వి రాజు, పెండ్యాల రాజేశ్వరరావు, విజయ కృష్ణమూర్తి, జోసెఫ్‌ కృష్ణ, బి. గోపాల, సముద్రాల సీనియర్‌, జూనియర్‌, డి.వి.నరసరాజు, యోగానంద్‌ కమలాకర్‌ ఇటువంటి దిగ్గజాలందరూ పనిచేస్తూ ఉండేవారు. నటన విలువ, నర్తనం విలువ, సినిమా జీవితం విలువ, అభిమానుల విలువ తెలిసి మసలుకున్న నటయోగి ఎన్‌.టి.రామారావు. ఆయన జీవన పయనంలో ఎదురైనా అద్భుతాలన్నీ ... అనితర సాధ్యమైన విజయాలన్నీ భావితరాలకి స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి. ఎన్టీఆర్ ఒక అధ్యయన గ్రంథం.


ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం..
1983 జనవరి 9 పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సిన తేదీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన తారీఖు. వెండితెరపై ఆరాధ్యుడిగా వెలిగిపోయిన నటరత్న నందమూరి తారక రామారావు.. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన ఘట్టం. ఆయన వెండితెర నుంచి రాజకీయ యవనిక మీదికి మారారు. అక్కడా అగ్ర కథానాయకుడు.. ఇక్కడ రాజకీయ రంగానా అగ్రాధిపత్యమే. మాటలతో మంట పుట్టించి, పదాలు దట్టించి, కాక పుట్టించి, పౌరుషాగ్ని రగిలించి, జనాన్ని అదిలించి, కదిలించి చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జనస్మృతి పథం నుంచి ఎలా మాయమవుతాడు. అక్షరాలు చెరిపేస్తే, చరిత్ర చెదిరిపోతుందా? చెరిగిపోతుందా? ఆకర్షణీయ రూపం స్మృతిపథం నుంచి తొలగి పోతుందా?

మహానియంతనే ఓడించిన సింహబలుడు..
ఆంధ్రప్రదేశ్​లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వ అధిపతిగా జనం మెచ్చిన జనపతి, ప్రబోధాత్మక సినిమాల దళపతి.. ఎన్టీఆర్​ను మర్చిపోవటం తేలికా? అది సంక్షేమానికి రాజముద్ర. అతడు మహానియంతనే ఓడించిన సింహబలుడు. రాజకీయాన్నే మార్చి, సంక్షేమం అనే పదానికే బ్రాండ్ అంబాసిడర్​గా నిలిచిన మహోన్నతుడు. ఆయన తెచ్చిన సంస్కరణలను విశ్లేషించి.. ఉపదేశించిన తారక మంత్రాన్ని కొత్త తరాల కోసం సమీక్షించుకోవాలి.

దిల్లీకి సలాం కొడుతూ.. మోకరిల్లిన రాష్ట్ర ముఖ్యమంత్రులు..!
కొన్ని ముద్రలు పడితే కలకాలం ఉంటాయి. వదలించుకోవటం ఒక పట్టాన సాధ్యం కాదు. మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చేసినా.. మద్రాసీలనే అవాంఛిత ముద్ర. తెలుగూ తెల్లారింది. తెలివీ తెల్లారింది. తెలుగు జాతి చేవలేనట్లు పడివుంది. ఇదేమీ పట్టని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, అమాత్యులు దిల్లీకి సలాం కొడుతూ.. మోకరిల్లారు. ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి తులాభారాలు, సత్కారాలు.

ఎవడబ్బ సొమ్ము అని ఎన్టీఆర్​ ఎంట్రీ..
ఆయన తర్వాత ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య.. ఎయిర్‌ పోర్టులో ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ అవమానించినా పట్టింపే లేదు. అవమాన భారాలయినా, తులాభారాలయినా దేనికైనా సిద్ధపడే తత్వం. పదవుల కోసం లాబీయింగ్​లు. లేడికి లేచిందే పరుగు అన్నట్లు తెల్లవారితే దిల్లీ పయనం. ఐదు నక్షత్రాల హోటళ్లలో బస. అంజయ్య జుంబో జెట్ క్యాబినెట్లో 61 మంది మంత్రులు. రవీంద్ర భారతి, పబ్లిక్ గార్డెన్​కూ ఓ మంత్రి. ఇవి చాలవన్నట్లు కార్పొరేషన్ పదవుల పందేరం. ప్రజాధనం వృథా.. అప్పుడే ఎవడబ్బ సొమ్మని ఖర్చుపెడుతున్నారంటూ ఎన్టీఆర్ నిలదీశారు. నిప్పులు చెరిగారు. జనంలో కట్టలు తెగే ఆగ్రహం.
రాజకీయాల్లోకి అగ్గిరాముడు ప్రవేశం
అధికార పార్టీలో అస్థిరత. ఒకే పార్టీలో ప్రబలిన ముఠాతత్వం రాష్ట్రాభివృద్ధికి గొడ్డలిపెట్టయ్యింది. రాజకీయ చదరంగంలో ముఖ్యమంత్రులు మారుతున్నారు. ఆ నాలుగేళ్లలో నలుగురు మారారు. పంటలు పండక, అప్పులు తీరక రైతుల ఆత్మహత్యలు, పనులు లేక, జరుగుబాటు లేక కూలీల వలసలు.. యువతకు కొలువుల్లేవు.. విద్యార్ధులు మెడిసిన్, ఇంజనీరింగ్ చదవాలన్నా డొనేషన్ల దోపిడీ ఎక్కువ. పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితులుండేవి. వ్యవసాయాలు ఎత్తుబడ్డాయి. వ్యాపారాలు మందగించాయి. ఏ వర్గమూ సంతోషంగా లేదు. సరిగ్గా అప్పుడే తారకరాముడు అగ్గిరాముడిలా వచ్చేశారు. రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధమైంది.

తెలుగుదేశం పార్టీ స్థాపన..!

1982 మార్చి 29హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్. సుముహూర్తం మధ్యాహ్నం రెండున్నర గంటలు. ఎన్టీ రామారావు పొలిటికల్ ఎంట్రీ నటరత్న నందమూరి తారక రాముడు. రాజకీయాల్లోకి వచ్చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్​లో నిజాం కళాశాలలో బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు."హరిజన గిరిజన, దళిత వర్గం, గూడేల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ వుంటే చూచి భరించలేక, వెనుక బడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే ఆంధ్రుల ఆత్మాభిమానం చంపుతుంటే, గుండె బద్దలై, మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను’'అన్న ఎన్టీఆర్ పలుకులు తెలుగు వారి మనసు తాకాయి. తెలుగుదేశం ఎక్కడి నుంచో ఊడిపడలేదు. ప్రజల మధ్యనే పుట్టింది. ‘ఈ తెలుగు దేశం శ్రామికుడి చెమటలోంచి పుట్టింది. కార్మికుడి కరిగిన కండలోంచి వచ్చింది. రైతు కూలీల రక్తంలోంచి పుట్టింది. నిరుపేదల కన్నీటి లోంచి, కష్టజీవుల కంటి మంటల్లోంచి, అన్నార్తుల ఆక్రందనల్లోంచి పుట్టింది ఈ తెలుగుదేశం’. సమాజమే దేవాలయంగా.. ప్రజలే దేవుళ్లుగా..! భావించి శంఖారావం పూరించారు. బడుగు, బలహీన వర్గాల సాధికారతే ధ్యేయంగా అజెండా తయారైంది. పార్టీ జెండా కూడా రూపు దిద్దుకుంది. 'తెలుగుదేశం పిలుస్తోంది రా! కదలిరా!' అనే పిలుపే నాటి ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ఓ మేలుమలుపు అయ్యింది. 1982మే 27, 28 తేదీల్లో తిరుపతిలో తెలుగుదేశం పార్టీ మహానాడు సభలు వైభవంగా నిర్వహించారు.
హరికృష్ణ రథసారథిగా.. చైత్యన రథ యాత్ర..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ దగ్గర ఛవర్లెట్ వాహనం కొనేసి.. ఎన్టీఆర్ ఆ వాహనానికి చైతన్య రథం అని పేరు పెట్టారు. ప్రచారయాత్రకు అనువుగా తీర్చిదిద్దారు. తనయుడు హరికృష్ణ రథసారథిగా తెలుగు నేల నలుదిక్కులా చుట్టేసే యాత్ర ఆరంభమైంది. తొంభై రోజుల పర్యటన అది. 1982 జూన్ 14. తెలుగుదేశం అధిపతి ఎన్టీఆర్ ప్రజా చైతన్య యాత్రకు బయలుదేరారు. బెల్ బాటం ప్యాంటు, పొడుగు చేతుల చొక్కా వేసి చైతన్య రథం మీద నిల్చుని '‘నా తెలుగింటి ఆడపడుచులారా, తమ్ముల్లారా.. ' అని ప్రారంభిస్తే జనం నుంచి అపూర్వ స్పందన. దశాబ్ధాల దగాకోరు కాంగ్రెస్ అంటూ నిప్పులు చెరుగుతున్నారు. పాలకుల నిష్క్రియను, బాధ్యతా రాహిత్యాన్ని చెరిగి పారేశారు. 'చెయ్యెత్తి జేకొట్టు తెలుగోడా’.. పాట ఎన్టీవోరు వచ్చాడంటూ పెద్దలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి రథం వెంట పరుగులు తీశారు.. కేరింతలు కొట్టారు. తారక రాముడిచ్చిన 'ఆంధ్రుల ఆత్మగౌరవం' అనే తారక మంత్రోపదేశం వారికి సులువుగా అర్థమైంది.
తారకరాముడి పిలుపే ప్రజలకు తారకమంత్రం..
రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని జనం.. తారక రాముడి పిలుపే ప్రభంజనం. ఎన్టీఆర్ సాయంత్రం రావాల్సివుంటే.. వచ్చేసరికి ఏ అర్ధరాత్రో అయ్యేది. అప్పటిదాకా జనం ఓపిగ్గా నిరీక్షించారు. జనాన్ని చూడగానే ఎన్టీఆర్‌ 'నేల ఈనిందా? ఆకాశానికి చిల్లు పడిందా? అంటూ వారిని ఉత్సాహపరిచేవారు. కాంగ్రెస్​ను దుష్టకాంగ్రెస్ అని, దగాకోరు కాంగ్రెస్ అంటూ మాటల దాడి సాగేది. అంతటితో ఆగేదా?' ' కుక్కమూతి పిందెలు' అని ఈసడించారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న వాళ్లని దుయ్యబట్టారు. అతిగా తినే వాళ్లకు వాడే.. కుక్షింభరులు లాంటి పదాలు సునాయాసంగా ఆయన నోటి నుంచి వెలువడుతుంటే.. జనం కరతాళ ధ్వనులు చేశారు. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలో 90 రోజుల పాటు ఏకబిగిన పర్యటన సాగింది. 35 వేల 500 కిలోమీటర్లు చుట్టివచ్చారు. నాడిది ఓ రికార్డుగా ప్రపంచం కీర్తించింది.

ఎన్టీఆర్​ పదఘట్టనకు కకాలవికలమైన కాంగ్రెస్​..
1982 అక్టోబర్ 3 నుంచి నవంబర్ 26 దాకా 55 రోజుల పాటు రెండో ప్రచార యాత్ర సాగింది. ఈ యాత్ర 25 వేల కిలోమీటర్లు చుట్టి వచ్చింది. మొత్తం మూడు దఫాలుగా సాగింది చైతన్య రథయాత్ర. ఎన్టీ రామారావు ఇచ్చిన ఆత్మగౌరవ నినాదాం పార్థుని పాశుపతాస్త్రమైంది. మాటలే అక్షరతుణీరాలై, అస్త్ర, శస్త్రాలై దూసుకొచ్చాయి. మూడు దఫాలుగా సాగిన చైతన్యరథ ఘట్టనకు, ఎన్టీఆర్ పద ఘట్టనకు కాంగ్రెస్ కకావికలమై.. తుడిచి పెట్టుకుపోయింది. ఈ ప్రజాయుద్ధంలో కాంగ్రెస్ అతిరథ మహారథులు ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ 201 సీట్లు గెలిచింది. కాంగ్రెస్​కు 60 సీట్లే వచ్చాయి. జనవరి తొమ్మిదో తేదీన లాల్ బహదూర్ స్టేడియంలో ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతానికి భిన్నంగా రాజ్​భవన్​లో కాకుండా ప్రజల మధ్య.. క్రీడా మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయటం ఒక విశేషం.

Post a Comment

Previous Post Next Post