తరతరాలకు తరగని వెలుగు యుగపురుషుడు ఎన్.టి.ఆర్ - చిత్తూరు ఎంపి - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

May 28, 2025

తరతరాలకు తరగని వెలుగు యుగపురుషుడు ఎన్.టి.ఆర్ - చిత్తూరు ఎంపి

కడప, త్రిశూల్ న్యూస్ :
తరతరాలకు తరగని వెలుగు, యుగపురుషుడు ఎన్.టి.ఆర్.. అని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు కొనియాడారు. కడప వేదికగా జరుగుతున్న రెండో రోజు మహానాడులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాచిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ఆ మహా నేతను స్మరించుకోవడంతో పాటు ఎన్టీఆర్ తెలుగుజాతికి అందించిన సేవలను గుర్తుకు చేసుకున్నారు. ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులౌతారు. తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులౌతారు’ అంటూ వేటూరి రాసిన పాట.. తెలుగుతెర ఇలవేల్పు నందమూరి తారక రామారావుకు సరిగ్గా సరిపోతుందని చెప్పారు. ఆయన సినీ ప్రస్థానం అంతా ఆ పాట పల్లవిలోనే కనిపిస్తుందని తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటులు ఉంటారు. వివిధ తరహా పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని మెప్పిస్తారు. కానీ, ప్రేక్షకులు దైవంగా భావించే మహానటుడు ఎన్‌.టి.రామారావు ఒక్కరేనన్నారాయన. బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం అహర్నిశలు శ్రమించిన 
నందమూరి తారక రామారావు ప్రజా సేవకుడిగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడి, అసలుసిసలైన రాజకీయనేతగా, రాజకీయాలకే వన్నె తెచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలో ఎంతో మంది మహానుభావులు పుట్టారు. వారి వారి రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించి పది మందికీ ఆదర్శంగా నిలిచారు. అయితే అందులో కొందరు కారణజన్ములుగా పేరు తెచ్చుకున్నారు. ప్రజలు వారిని దైవంగా కొలిచారు. తమ గుండెల్లో పవిత్రమైన స్థానాన్ని ఇచ్చారు. అలాంటి అతి కొద్దిమంది మహానుభావుల్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అని కీర్తించారు. ఆ మహా నాయకుడి స్ఫూర్తితోనే ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతూ.. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ నవ్యాంధ్ర నిర్మాణానికి బాటలు వేస్తున్నారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలియజేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages