వినాయక సాగర్ పార్కులో దెబ్బతిన్న చిన్నపిల్లల క్రీడా పరికరాలు మార్చండి..! - Trishul News

Trishul News

ప్రతిక్షణం.. ప్రజాహితం

Breaking

Home Top Ad

Responsive Ads Here

Post Top Ad

Responsive Ads Here

September 29, 2025

వినాయక సాగర్ పార్కులో దెబ్బతిన్న చిన్నపిల్లల క్రీడా పరికరాలు మార్చండి..!

- తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ కు కాంగ్రెస్ పార్టీ వినతి
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :
తిరుపతి వినాయక సాగర్ పార్కులో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో తాము ఆందోళనకు దిగుతామని తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నగరపాలక సంస్థ కమిషనర్ కు స్పష్టం చేశారు. సోమవారం స్పందన కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ను కలిసి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు, పిసిసి ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ గతంలో ఈ సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని ఈ పార్కులో చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు బొమ్మలు అలాగే పెద్దలు ఉదయం, సాయంత్రం నడకతో పాటుగా వ్యాయామం చేసుకోవడానికి వీలుగా అనేక పరికరాలను ఏర్పాటు చేసి ఉన్నారని చెప్పారు. ప్రతిరోజు ఈ పార్కు వెయ్యి మందికి తగ్గకుండా స్థానిక ప్రజలు వస్తున్నారని చెప్పారు. సాయంత్రం పూట పిల్లలతో పాటు ఇక్కడికి వస్తున్న పెద్దలు ఇక్కడి ఆట వస్తువులను చూసి ఆవేదనకు గురవుతున్నారని వివరించారు. కొన్ని ఆట వస్తువులు విరిగిపోవడం మరికొన్ని పాక్షికంగా దెబ్బతిని ఉన్నాయన్నారు. ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఏనుగు, సింహం, ఎలుగుబంటు, కొంగ వంటి బొమ్మలు రంగులు కోల్పోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయని అలాగే దెబ్బతిని ఉన్నాయని తెలియజేశారు. వీటిని మరమ్మతు చేయించడం ద్వారా పిల్లలు ఎక్కువగా ఆడుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు. దెబ్బతిన్న చిన్నపిల్లల ఆట వస్తువులను మరమ్మతు చేయించాలని కోరారు. పెద్దలు వ్యాయామం కోసం ఏర్పాటుచేసిన ఎక్సర్సైజ్ పరికరాలు సైతం కొన్ని విరిగిపోయి ఉన్నాయని మరికొన్ని ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నగరంలో ఇతర పార్కులు కన్నా ఇక్కడే ఎక్కువ మంది యువతి యువకులు, వృద్ధులు సైతం వాకింగ్ కు వచ్చి వ్యాయామం చేయడం జరుగుతోందని పాడైన వాటిని కూడా ప్రజలకు ఉపయోగపడేలా వినియోగంలోకి తేవాలని వారు కోరారు. పిల్లలు ఆడుకునే ప్రాంతాల్లో అలాగే పెద్దలు వాకింగ్ చేసే ప్రాంతాల్లో దట్టమైన పొదలు ఉన్న కారణంగా విషపురుగులు సంచారం ఎక్కువైందని, సాయంత్రం వేళల్లో ఏక్షణాన ఏమవుతుందోనన్న భయం అందరిలో పెరుగుతోందని తెలిపారు. ఈనేపధ్యంలో పెరిగిన పొదలను తొలగించాలని వారు కమిషనర్ కు తెలిపారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండటంతో పార్కుకు వచ్చిన వారు ఇబ్బందులు పడుతున్నారని దీనిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. వినాయక సాగర్ చెరువు అపరిశుభ్రంగా ఉన్న కారణంగా విపరీతమైన దుర్గంధం వ్యాపిస్తోందని, పార్కుకు ఉదయం, సాయంత్రం వాకింగ్కు వచ్చే ప్రజలు చెరువు పరిసర ప్రాంతాల్లో నిలబడలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆరోగ్యకర వాతావరణ కోసం వచ్చేవారికి దుర్గంధ పూరిత వాతావరణం ఎదురవుతోందని వివరించారు. చెరువును శుభ్రం చేయాలని బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటుగా చెరువులో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు చిత్తూరు శివశంకర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోయన నరేంద్ర బాబు తిరుపతి కాంగ్రెస్ పార్టీ కమిటీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు గొడుగుచింతల గోపి, ఆర్గనైజింగ్ సెక్రటరీ తవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages