స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు, బెదిరింపులు ఎదురుకాకుండా తగిన భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్, తిరుపతి జిల్లా కలెక్టరు ఎస్పీలకు లేఖ రాశారు. అక్టోబర్ 14 న జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను ప్రస్తావిస్తూ, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఎంపీ కోరారు. నామినేషన్ కేంద్రాల వద్ద తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు ఎలాంటి అడ్డంకులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. నామినేషన్ కేంద్రాల్లో అవసరమైన పరిపాలనా సౌకర్యాలు ఏర్పాట్లు చేయడంతో పాటు, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ను కోరారు. పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. అలాగే, ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులను బెదిరించడం, అడ్డుకోవడం వంటి ఘటనలు జరగకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కోరారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచి, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, ఆ హక్కుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు.
తిరుపతి, త్రిశూల్ న్యూస్ :

No comments:
Post a Comment