Trishul News

నవరస నటనా సార్వభౌమ కైకాల కన్నుమూత..!

హైదరాబాద్, త్రిశూల్ న్యూస్ :
సీనియర్‌ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. 60 ఏళ్ల పాటు చిత్రపరిశ్రమకు సేవలందించిన కైకాల.. 1935, జులై 25న కృష్ణా జిల్లా కౌతవరంలో జన్మించారు. మొత్తం 777 సినిమాల్లో నటించారు. యమధర్మరాజు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, భరతుడు, రావణాసురుడు, ఘటోత్కచుడి ప్రాత్రల్లో మెప్పించారు. ఒక దశలో సీనియర్‌ ఎన్టీఆర్‌ తర్వాత పౌరానిక చిత్రాల్లో రాణించిన ఏకైక నటుడిగా గుర్తింపు పొందారు. కైకాల సత్య నారాయణ మరణ వార్త తెలిసి టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. వయోభారంతో కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కైకాల సత్యనారాయణ ఒకప్పుడు రమా ఫిలింస్ అనే బ్యానర్‌తో సినిమాలను కూడా నిర్మించారు. కైకాల సత్యనారాయణ తర్వాత ఆయన వారసుడు.. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కైకాల మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌నగర్‌కు ఆయన భౌతికకాయం తరలించనున్నారు. శనివారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


గంభీరమైన వాచకంతో మాటలే తూటాల్లా దూసుకువస్తుంటే...!

అగ్రనటులకు ఏ మాత్రం తీసిపోని ఆహార్యంతో ప్రేక్షకులను పాత్రలకు కట్టిపడేస్తుంటే...? అబ్బురపరిచే ఆంగికంతో పాత్రేదైనా...ఘట్టమేదైనా నేను దిగనంత వరకే.. అనేలా మేటి నటులకూ సవాల్ విసురుతుంటే..? అభినయానికి నిలువుటద్దంలా...నవరసాల గనిలా...వెరసి నటనకే నిలువెత్తు రూపంలా ఓ నటుడు వెండితెరను ఏలుతుంటే...? ఈ లక్షణాలన్నీ కలిగిన నటుడికి ఓ పేరంటూ పెడితే.....ఆ పేరే కైకాల సత్యనారాయణ. అవును హీరోగా, కరుడు కట్టిన విలన్ గా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఒక్కటేంటి కైకాల పోషించని పాత్ర లేదు....వేయని వేషం లేదు. 9 దశాబ్దాల తెలుగు సినీచరిత్రలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల్లో సూపర్ స్టార్ స్టేటస్ అనుభవించింది ఒకరు ఎస్వీ రంగారావు అయితే...మరొకరు నిస్సందేహంగా కైకాల సత్యనారాయణ..

చెల్లెలి కోసం ప్రాణం విడిచేందుకు వెనుకాడని అన్నగా వేయాలన్నా ఆయనే, కఠినాత్ముడైనా సంగీతం కోసం తాపత్రయపడే విభిన్నమైన మనస్తత్వం ఉన్న పాత్ర పోషించాలన్నా ఆయనే.. యముండ అని ట్రేడ్ మార్క్ డైలాగులతో సమధర్మచక్రవర్తిని కళ్లముందు సాక్షాత్కరించినా ఆయనే, అమాయక చక్రవర్తిలా కామెడీ విలనీ పండిచాలన్నా.. ఉంగరాల సాంబయ్యరా అంటూ వెండితెరపై విరుచుకుపడాలన్నా.. ఏం చేయాలన్నా కైకాల సత్యనారాయణే అనే స్థాయిని పొందిన నటుడాయన. పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, సాంఘికం ఇలా చిత్రమేదైనా సరే.. ఏకకాలంలో ప్రేక్షకులను మెప్పించిన అరుదైన కళాకారుడు. 86ఏళ్ల వయస్సు....అరవై ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం.... దాదాపు ఎనిమిది వందల సినిమాలు...తెలుగు చలనచిత్ర సీమ గర్వించదగిన అగ్రనటీనటులతో పోటాపోటీగా నటించి చూపించిన అద్భుతమైన ప్రస్థానం...కైకాల సత్యనారాయణ గారి సొంతం.

కైకాల సత్యనారాయణ ప్రస్థానం..!

కృష్ణా జిల్లా కౌతవరంలో 1935 జులై 25న జన్మించారు కైకాల సత్యనారాయణ. గుడ్లవల్లేరులో బడి చదువును పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ విజయవాడలో చదివి.. గ్రాడ్యుయేషన్ కోసం తిరిగి గుడివాడకు వచ్చారు సత్యనారాయణ. కళాశాల చదివే రోజుల్లోనే నాటకాలపైన ఆయనకు విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో నాటక పోటీల్లో పాల్గొనేవారు. అలా 1952లో ఆచార్య ఆత్రేయ రాసిన నాటకం "ఎవరు దొంగ"ను ప్రదర్శించారు సత్యనారాయణ. ఆ నాటకాన్ని చూసిన సినీ దర్శకుడు గరికపాటి రాజారావు.. నీ ముఖవర్చస్సు బాగుందని సినిమాల్లోకి రావాలని ఆహ్వానించారు. డిగ్రీ పూర్తైన తర్వాతే సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తానని సత్యనారాయణ చెప్పటంతో.. రాజారావు అందుకు అంగీకరించారు. ఎల్వీ ప్రసాద్ దగ్గర అసిస్టెంట్ గా చేరిన మిత్రుడు కేఎల్ ధర్ కూడా అదే చెప్పటంతో.. మద్రాసుకు పయనమయ్యారు కైకాల సత్యనారాయణ. మద్రాసు వెళ్లినా.. సినీ అవకాశాలు అంత తేలిగ్గా సత్యనారాయణను వరించలేదు. మిత్రులంతా హీరోలా ఉంటావు అని ఇచ్చిన ప్రోత్సాహంతో చెన్నపట్టణానికి వచ్చిన సత్యనారాయణ ఎన్నో తిరస్కరణలను ఎదుర్కొన్నారు. కాదనిపించుకున్న ప్రతీసారి ఇంటికి వెళ్లిపోదామనే ఆలోచన ఆయను మెదడును తొలిచినా.. తనను తాను నిరూపించుకోవాలనే సంకల్ప బలమే ఆ ఆలోచనలను విరమించుకునేలా చేసింది. ఎంతో కాలం నిరీక్షణ తర్వాత తొలి అవకాశం అందుకున్నారు కైకాల. మిత్రుడి సలహాతో మద్రాసుకు వచ్చిన సత్యనారాయణ దర్శక నిర్మాత ఎల్వీ ప్రసాద్ ‘కొడుకులు-కోడళ్లు’ అనే సినిమా కోసం నిర్వహించిన ఆడిషన్స్ లో పాల్గొన్నారు. సత్యనారాయణకు ఎల్వీ ప్రసాద్ స్క్రీన్‌ టెస్టులన్నీ చేసి ఓకే చేశారు. దురదృష్టవశాత్తు ఆ సినిమా ప్రారంభం కాలేదు. మొక్కవోని ధైర్యంతో సత్యనారాయణ దర్శకనిర్మాత బి.ఎ.సుబ్బారావును కలిశారు. ఆయన సత్యనారాయణను ప్రముఖ దర్శకనిర్మాత కె.వి.రెడ్డి వద్దకు పంపితే ఆయన మేకప్‌ టెస్ట్‌, వాయిస్‌ టెస్ట్‌, స్క్రీన్‌ టెస్ట్‌ అన్నీ చేయించి కూడా అవకాశం కల్పించలేకపోయారు. అలా ‘దొంగరాముడు’ సినిమాలో తనకు దక్కాల్సిన పాత్ర ఆర్‌.నాగేశ్వరరావుకు దక్కింది. చివరకు దేవదాసు నిర్మాత డీఎల్ నారాయణ సత్యనారాయణ రూపాన్ని చూసి, అతని గెటప్‌ నచ్చి, చందమామ బ్యానర్‌పై చెంగయ్య దర్శకత్వంలో తీసిన ‘సిపాయి కూతురు’లో హీరోగా జమున సరసన నటింపజేశారు. అదే సత్యనారాయణకు మొదటి సినిమా. కానీ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. డీఎల్ నారాయణ.. సత్యనారాయణతో నెలకు 300రూపాయలు చొప్పున.. మూడు సంవత్సరాల అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. దీంతో సత్యనారాయణకు ఇతర సంస్థల్లో నటించేందుకు అవకాశం లేకపోయింది. ‘సిపాయి కూతురు’ దెబ్బతినడంతో డీఎల్ కూడా సత్యనారాయణతో మరో సినిమా ప్రారంభించలేకపోయారు. ఎన్టీఆర్‌కు దగ్గర పోలికలుండటం చేత సత్యనారాయణ ఖాళీగా ఉండకుండా ఆయనకు డూపుగా చాలా సినిమాల్లో నటించారు. 1960లో ఎన్టీఆర్‌ చొరవతోనే మోడరన్‌ థియేటర్స్‌ వారి ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ చిత్రంలో నటుడిగా అవకాశాన్ని అందుకున్నారు. ఆ సినిమా దర్శకుడు ఎస్డీ లాల్ విఠలాచార్య శిష్యుడు కావటంతో.. సత్యనారాయణలో ఉన్న ట్యాలెంట్‌ను గుర్తించి విఠలాచార్యకు పరిచయం చేశారు. అదే సత్యనారాయణ కెరీర్ లో కీలక మలుపు. హీరో వేషాల కోసం వేచి చూడకుండా విలన్ లు తక్కువగా ఉన్న ఇండస్ట్రీలో కొరతను తీరుస్తూ అవకాశాలను అందుకోవాలని విఠలాచార్య ఇచ్చిన సలహాను సత్యనారాయణ స్వీకరించారు. అలా మొదటిసారిగా విఠలాచార్య దర్శకత్వం వహించిన ‘కనకదుర్గ పూజామహిమ’లో విలన్ గా నటించారు కైకాల సత్యనారాయణ. అందులో పోషించిన సేనాధిపతి పాత్ర సత్యనారాయణను విలన్‌గా నిలబెట్టింది. అదే ఏడాది వివాహం కావటంతో.. హీరోగా ప్రయత్నాలు మానుకున్న సత్యనారాయణ విలన్ అవకాశాలైనా సరే వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ దర్శకుడు బీఎన్ రెడ్డి సైతం తన రాజమకుటం సినిమాలో సత్యనారాయణతో చిన్న పాత్ర చేయించారు. విలన్ గా చేయటం ప్రారంభించినా.. కొన్నాళ్లపాటు సత్యనారాయణకు అవకాశాలు అంతగా రాలేదు. అయినా తన సమయం కోసం ఓపికగా ఎదురు చూశారు. విలన్ గా రావటం ప్రారంభించిన తర్వాత.. చాలా మంది ఒకే తరహా పాత్రలతో ఆయన దగ్గరకు వెళ్లేవారు. కానీ స్వతహాగా సత్యనారాయణకు ఆల్ రౌండర్ గా నిరూపించుకోవాలనే కోరిక బలంగా ఉండేది. మంచి అవకాశాలు, విభిన్నమైన పాత్రలను పోషించాలని సత్యనారాయణ చాలా తాపత్రయపడేవారు. రొటీన్ కు భిన్నమైన పాత్రలు ఇవ్వాలని.. తనను తాను నిరూపించుకోగలనని అగ్రనటులకు సవాల్ విసిరే ధైర్యం చేసే వారు సత్యనారాయణ. ఆయన నటనపై ఆయనకు అంత నమ్మకం. కనకదుర్గ పూజా మహిమ సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్‌ వచ్చినా 1962లో సత్యనారాయణకు మంచి అవకాశాలు వచ్చాయి. శ్యాం ప్రసాద్‌ మూవీస్‌ వారు వై.ఆర్‌.స్వామి దర్శకత్వంలో నిర్మించిన స్వర్ణగౌరిలో శివుడి పాత్ర సత్యనారాయణను వరించింది. తర్వాత మదనకామరాజు కథలో ధర్మపాలుడుగా అద్భుతంగా నటించారనే పేరు సంపాదించుకున్నారు సత్యనారాయణ. పౌరాణిక పాత్రలు మెల్లగా ఆయన్ను వెతుక్కుంటూ రావటం మొదలు పెట్టాయి. ఆహార్యంలో అచ్చం ఎన్టీఆర్ ను తలపించటం సత్యనారాయణకు ప్రధాన బలం. అందుకే శ్రీకృష్ణార్జున యుద్ధంలో కర్ణుడు, సి.పుల్లయ్య సారధ్యంలో వచ్చిన సంచలన పౌరాణిక రంగుల చిత్రం లవకుశలో భరతుడు, నర్తనశాలలో దుశ్శాసనుడు పాత్రలను పోషించారు సత్యనారాయణ. శ్రీకృష్ట పాండవీయం, పాండవవనవాసం సినిమాల్లో ఘటోత్కచునిగా, శ్రీకృష్ణావతారం, కురుక్షేత్రంలో సుయోధనుడిగా, దానవీరశూరకర్ణలో భీమునిగా, చాణక్య చంద్రగుప్తలో రాక్షస మంత్రిగా, సీతాకల్యాణంలో లంకాధిపతి రావణాసురునిగా.. విలక్షణ పాత్రలు పోషించి మెప్పించారు సత్యనారాయణ. 1967లో వచ్చిన ఉమ్మడి కుటుంబం సినిమాలో ఓ మంచి పాత్ర కోసం సత్యనారాయణ.. ఎన్టీఆర్ కే సవాల్ విసిరారు అంట. సినిమాలో కీలకమైన విషాద ఛాయలున్న రెండో అన్నయ్య పాత్ర కావాలని కోరారట సత్యనారాయణ. ఆ పాత్ర సత్యనారాయణ చేయగలరో లేదో అనే మీమాంసలో ఎన్టీఆర్ ఉన్న సమయంలో.. రెండు రోజులు షూట్ చేసి తన నటనను చూడాలని కోరారట. నచ్చితేనే సినిమాలో కొనసాగించండి లేదంటే పంపించేయండి అని సత్యనారాయణ ఖరాఖండీగా చెప్పటంతో.. రెండో అన్నయ్య పాత్ర కోసం సత్యనారాయణను ఎంపిక చేశారు. ప్రథమార్థంలో సౌమ్యంగా, ద్వితీయార్థంలో అత్తవారింట్లో అవస్థలు పడే చేతకాని అల్లుడి పాత్రలో సత్యనారాయణ నటన అద్భుతం. గుబురు గడ్డంతో.. విషాద భరిత వదనంతో ఆయన నటిస్తుంటే.. ఎన్టీఆర్ ప్రశంసించకుండా ఉండలేకపోయారంట. అదీ సత్యనారాయణ అంటే. ఓ పాత్రకో.. ఓ జోనర్ కో పరిమితమైపోయే నటుడు కాదు ఆయన.. అందుకే నవరసనటనా సార్వభౌమ బిరుదాకింతుడయ్యారు కైకాల సత్యనారాయణ. విలన్ గా పాత్రలు వస్తున్నాయి కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్న భావాలు పలికించే పాత్రలు రావాలంటే.. ఎవరో ఒకరిని బతిమాలుకోవాలి. ఈ పద్ధతి ఏ మాత్రం నచ్చేది కాదు సత్యనారాయణకి. అలాంటి పరిస్థితుల్లో విడుదలైన ఓ సినిమా సత్యనారాయణ కెరీర్ గ్రాఫ్ ను అమాంతం మార్చేసింది. ఇక అక్కడి నుంచి మొదలు విలన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకూ ఏ పాత్ర పోషించాలన్నా వినిపించే పేరుగా మారిపోయారు కైకాల సత్యనారాయణ. 1973లో కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శారద చిత్రం కైకాల సత్యనారాయణ సినీ జీవితాన్ని మలుపు తిప్పిందనే చెప్పుకోవాలి. పెళ్లైన కొన్నాళ్లకే భర్తను కోల్పోయి మానసిక సంఘర్షణకు లోనైన తన చెల్లెలి కాపురాన్ని చక్కదిద్దాలకునే అన్నగా.. కైకాల నటన నభూతో నభవిష్యతి. ఈ పాత్రలో ఆయన ఎంత గొప్పగా నటించారంటే ఇక ఆ తర్వాత ఆయన పాత్రల కోసం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేనంతగా పేరు సంపాదించారు. ఇదే విషయాన్ని పలు మార్లు గర్వంగా చెప్పుకునేవారు సత్యనారాయణ. ఈ చిత్రం శతదినోత్సవాన్ని పూర్తి చేసుకోవటంతో పాటు ఆ ఏడాదికి ఉత్తమ చిత్రంగా నంది అవార్డును సైతం కైవసం చేసుకుంది. అప్పటి వరకూ విలన్ పాత్రలో లేదా ఆహార్యం ఉంది కాబట్టి పౌరాణిక పాత్రలు మాత్రమే చేయగలడు అనుకునే సత్యనారాయణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ అదరగొట్టగలడని శారద చిత్రం నిరూపించింది. 1977లో తాతినేని రామారావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిచిన చిత్రమే యమగోల. అందులో తొలిసారిగా యముడి వేషం వేసిన సత్యనారాయణ నిజంగా యముండంటూ ఉంటే ఇలానే ఉంటారా అన్న స్థాయిలో నటించారు. ధర్మ పరిరక్షణ ధురంధురుండా.. యముండా అంటూ సత్యనారాయణ చెప్పిన ట్రేడ్ మార్క్ డైలాగ్ కి అయితే హాల్ మొత్తం ఈలలు, గోలలతో నిండిపోయేది. ఎన్టీఆర్ మాస్ మసాలాకు తోడు సత్యనారాయణ యాక్టింగ్ తోడవటంతో.. యమగోల సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. యముడి కంటే నరుడే గొప్ప అనేలా సాగే ఆ పాత్రలు, ఆకథ ద్వారా ఆ తర్వాత ఇక యముడి పాత్ర అంటే సత్యనారాయణ మాత్రమే గుర్తొచ్చేలా ప్రేక్షకుల హృదయాల్లో పేటెంట్ హక్కులు పొందారాయన. తనదైన నటనను ప్రదర్శించే పాత్రలు వచ్చిన ప్రతీసారి వెండితెరపై చెలరేగిపోయిన సత్యనారాయణ.. మిగిలిన సమయాల్లో విలన్ గా, కామెడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలను పోషించారు. కేవలం తెలుగు తెరకే ఆయన పరిమితం కాలేదు. మధ్యలో హిందీ, తమిళ సినిమాల్లోనూ నటించారు.ఇటు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తోనూ అటు దిలీప్ కుమార్ లాంటి ఆల్ గ్రేట్ టైం తోనూ నటించిన అనుభవం సత్యనారాయణ సొంతం. అక్కినేని క్లాసిక్ హిట్ ప్రేమనగర్‌ లో కేశవవర్మ పాత్రలో సత్యనారాయణ జీవించారు. అడవిరాముడు, వేటగాడు సినిమాల్లో విభిన్నమైన కామెడీ విలన్‌ పాత్రలు పోషించి అద్భుతంగా మెప్పించిన సత్యనారాయణ నటనకు సరికొత్త భాష్యం చెప్పారు. మోస‌గాళ్ళకు మోస‌గాడు, దొంగ‌ల వేట మొద‌లైన సినిమాల్లో ఆయ‌న పోషించిన విల‌న్ పాత్రలు మ‌ర్చిపోలేనివి. దేవుడు చేసిన మ‌నుషులు సినిమాలో హాస్యాన్ని పండించి తన పాత్రకు జీవం పోసిన సత్యనారాయణ.. గొప్పనటుడిగా ఎదుగుతున్నావ్ అంటూ ఎస్వీరంగారావు నుంచి ప్రశంసలు అందుకున్నారట. సత్యనారాయణ షూటింగ్ లో ఉండగా ఎస్వీరంగారావే స్వయంగా సెట్ కు వచ్చిన అందించిన ఆ ప్రశంసలు జీవితంలో మర్చిపోలేనివి అని చెబుతారు సత్యనారాయణ. యస్వీ రంగారావు మరణానంతరం ఆయన పోషించాల్సిన గంభీర పాత్రలు ఎక్కువగా సత్యనారాయణనే వరించాయి. దాంతో కేరక్టర్‌ నటునిగా తనని తాను మలుచుకునే అవకాశం సత్యనారాయణకు దక్కింది. గూండా, గ్యాంగ్‌లీడర్‌, సమరసింహారెడ్డి వంటి సినిమాల్లో బాధ్యాతాయుతమైన పోలీసు అధికారిగా నటించి ఆ పాత్రలకే వన్నె తెచ్చారు. తాత మనవడు, చదువు సంస్కారం, తూర్పుపడమర, నేరము శిక్ష, సిరిసిరిమువ్వ, బంగారు కుటుంబం, అన్వేషణ, తాతయ్య ప్రేమలీలలు, బొబ్బిలిరాజా, మంత్రిగారి వియ్యంకుడు, శ్రుతిలయలు, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, రుద్రవీణ, అల్లుడుగారు, ఒంటరిపోరాటం వంటి సాంఘిక చిత్రాల్లో సత్యనారాయణ విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు, యమగోల హిట్ ఫార్మూలా యముడి పాత్రను ఆ తర్వాత కొనసాగించిన సత్యనారాయణ సోషల్‌ ఫాంటసీ చిత్రాలు యమలీల, యముడికి మొగుడు, రవితేజ దరువు వంటి చిత్రాల్లో యముడిగా నటించి ఆ పాత్ర ధరించాలంటే తనే కేరాఫ్ అడ్రస్ అనే స్థాయికి తీసుకెళ్లారు. మరోవైపు సాత్విక‌మైన పాత్రలకు కూడా స‌త్యనారాయ‌ణ బెస్ట్ ఆప్షన్ అయ్యారు. సంసారం సాగ‌రం, రామ‌య్య తండ్రి, జీవిత‌మే ఒక నాట‌క‌రంగం, దేవుడే దిగివ‌స్తే, తాయార‌మ్మ- బంగార‌య్య, పార్వతీ ప‌ర‌మేశ్వరులు మొద‌లైన చిత్రాల్లో కీల‌క పాత్రలు పోషించి విల‌న్ ఇమేజ్ నుంచి బ‌య‌ట‌ప‌డి. కుటుంబ ప్రేక్షకుల‌కు సత్యనారాయణ అభిమాన న‌టుడ‌య్యారు. 1976లో దర్శకులు బాపుతీసిన సీతా స్వయంవర్ తో హిందీలో నటించిన సత్యనారాయణ 1977లో శ్రీరామ్ వనవాస్, 1986లో బాలీవుడ్ సూపర్ స్టార్ దిలీప్ కుమార్, అనిల్ కపూర్, నసీరుద్దీన్ షాలతో కలిసి కర్మ సినిమాలో నటించారు. ఒక అశోక్‌కుమార్‌, ఒక సంజీవ్‌ కుమార్‌, ఒక శివాజీ గణేశన్ ముగ్గురూ కలిస్తే సత్యనారాయణ అని ఆ చిత్ర దర్శకుడు సుభాష్ ఘాయ్ సత్యనారాయణను ప్రశంసించటం భాషలతో సంబంధం లేని ఆయన నటనా కౌశలానికి మచ్చు తునక. తమిళంలో కమల్ హాసన్, రజినీకాంత్ వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ పాత్రలను పోషించిన సత్యనారాయణ వృత్తిమీద ఉన్న అంకిత భావంతో... రమా ఫిలిమ్స్‌ పేరిట చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించారు. గజదొంగ, ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కటుంబం, ముద్దుల మొగుడు వంటి ఎనిమిది ప్రయోజనకరమైన చిత్రాలు తీసి విజయం సాధించారు కైకాల సత్యనారాయణ. కొన్ని చిరంజీవి సినిమాలకు సహ నిర్మాతగానూ వ్యవహరించారు. ఎన్టీఆర్ తో సత్యనారాయణకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని కచ్చితంగా చెప్పుకునితీరాల్సిందే. సత్యనారాయణ ఎదుగుదలలో నందమూరి తారకరామారావు పాత్ర కీలకమని సత్యనారాయణే చాలా సందర్భాల్లో చెబుతారు. సినిమాల్లో కి రావటానికి ఎన్టీఆర్ కు దగ్గర పోలికలు ఉండటం ఓ కారణమైతే.. నటించి నిరూపించుకోవటానికి అవకాశాలే లేనప్పుడు ఎన్టీఆర్ కి డూప్ గా చేసిన పాత్రలే ఆయనకు దగ్గర చేశాయి అంటారు సత్యనారాయణ. సినిమాలతో ప్రారంభమైన వారి అనుబంధం ఆ తర్వాత రాజకీయ పార్టీ స్థాపనలోనూ కలిసే అడుగు ముందుకు వేసింది. ఎన్టీఆర్, సత్యనారాయణ కలిసి నటించిన సినిమాలు అక్షరాలా 100. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఓ నటుడు కలిసి నటించిన అత్యధిక చిత్రాల రికార్డు దక్షిణాదిన వీరిదేనేమో. రాముడు-భీముడు సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ద్విపాత్రాభినయం కాగా.. ఓ పాత్రలో కైకాల సత్యనారాయణే ఎన్టీఆర్ కి డూప్ గా వ్యవహరించారు. పతాక సన్నివేశాల్లో, ఫైట్ సీన్లలో నేరుగా సత్యనారాయణే ఎన్టీఆర్ నటించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పోషించటానికి వీలులేని పాత్రలన్నీ సత్యనారాయణ దగ్గరకు రావటం ప్రారంభించాయి. తన కోసం ఇంత కష్టపడుతున్న సత్యనారాయణ నటుడిగానూ నిరూపించుకోవాలని ఎన్టీఆర్ తాపత్రయ పడేవారట. అలా ఎన్నో పౌరాణిక చిత్రాల్లో తన పాత్ర తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న పాత్రలను సత్యనారాయణకు ఇప్పించేవారట ఎన్టీఆర్. ఇద్దరి మధ్య కొన్ని సందర్భాల్లో మనస్పర్థలు వచ్చినా తమ్ముడూ అంటూ ఆప్యాయంగా పిలుస్తూ క్షమించమని కోరటం ఎన్టీఆర్ పెద్దరికానికి నిదర్శనం అంటారు సత్యనారాయణ. నిప్పులాంటి మనిషి చిత్రంలో స్నేహమేరా జీవితం పాట సినిమా పరంగా ఎలా ఉన్నా వాళ్ల నిజజీవిత అనుబంధానికి అద్దం పడుతుంది. సత్యనారాయణ, ఎన్టీఆర్‌ అన్నయ్య ఒకే ఫ్రేములో ఉంటే ఒక సింహం, ఒక ఏనుగు ఢీకొన్నట్లు ఉండేది. నన్ను నంబర్‌ వన్‌ విలన్‌వి అని అన్నగారు మెచ్చుకునేవారని చెబుతారు సత్యనారాయణ. ఉమ్మడి కుటుంబం సినిమాలో సెంటిమెంట్‌ పండించే రైతు పాత్రను ఇస్తే.. విలన్‌గా చేసేవాడికి సెంటిమెంట్‌ క్యారక్టరా అన్నవాళ్లు ఉన్నారు. ఆ పాత్రతో ప్రేక్షకులచేత కన్నీరు పెట్టించి నటుడిగా తనేంటో నిరూపించుకునే అవకాశాన్ని ఎన్టీఆర్ కల్పించారంటూ చాలా సార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటారు సత్యనారాయణ. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు ఆయన పార్టీ నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నప్పుడు.. ప్రచార ప్రణాళికలు, అధికారం కైవసం చేసుకోవటం ఇలా ప్రతీ సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా సత్యనారాయణ ఎన్టీఆర్ కు తోడుగా నిలిచారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎన్నిసార్లు ఆహ్వానించినా సత్యనారాయణ పెద్దగా ఆసక్తి చూపించలేదు. చివరిరోజుల్లో సత్యనారాయణను పిలిచి నీకు మాత్రమే ఏం చేయలేకపోయాను రాజ్యసభకు పంపించే ఆలోచనలో ఉన్నానని చెప్పారట ఎన్టీఆర్. అది అప్పుడు కుదరకపోయినా ఆతర్వాత చంద్రబాబు ఆహ్వానం మేరకు 1996లో మచిలీపట్నం ఎంపీగా గెలిచి లోక్ సభకు వెళ్లారు సత్యనారాయణ. ఆ మరుసటి ఎన్నికల్లో ఓటమి పాలవటంతో రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించారు సత్యనారాయణ. అలా సత్యనారాయణ కెరీర్ లో ఎన్టీఆర్ ది ప్రత్యేక అనుబంధం. 1959 నుంచి ఇప్పటివరకూ 62 సంవత్సరాల సినీ ప్రస్థానంలో కైకాల సత్యనారాయణ మొత్తం ఆరు తరాల నటులతో కలిసి నటించారు. నాగయ్య తరం నటుల నుంచి మహేష్ బాబు సినిమాల వరకూ సత్యనారాయణ విభిన్నమైన పాత్రలను పోషిస్తూనే ఉన్నారు. మొత్తం 800 పై చిలుకు చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న సత్యనారాయణ తన నటనతో ఎన్నో అవార్డులను సత్కారాలను అందుకున్నారు. నటుడిగా సత్యనారాయణ పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసారు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించారు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు. గత కొన్నేళ్లుగా సినిమాలకు పూర్తి దూరంగా ఉన్న సత్యనారాయణ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. మహేష్ బాబు మురారి చిత్రంలో సత్తిపండుగా కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యనారాయణ ఆ తర్వాత రవితేజతో కలిసి ఇడియట్, జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నరసింహుడు, చిరంజీవితో అందరివాడు సినిమాల్లో నటించారు. కోడి రామకృష్ణ అనుష్కతో తీసిన సూపర్ హిట్ సినిమా అరుంధతిలో సత్యనారాయణ పోషించిన తాతయ్య పాత్రే ఆయన యాక్టివ్ గా కనిపించిన చివరి రోల్. 2019లో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడులో దర్శకుడు హెచ్ఎం రెడ్డి పాత్రలో, అదే ఏడాది మహేష్ బాబు మహర్షి చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే తాతయ్య పాత్రలో తళుక్కున మెరిశారు సత్యనారాయణ. సత్యనారాయణ నటించిన 800 పైచిలుకు చిత్రాల్లో 223 సినిమాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. దాదాపు 200 మంది దర్శకులతో ఆయన కలిసి పనిచేశారు. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాల్లో వైవిధ్య భరితమైన నటన ప్రదర్శించినందుకు సత్యనారాయణకు అనంతపురం, గుడివాడ పట్టణాలలో ‘నటశేఖర’ బిరుదు ప్రదానం చేశారు. కావలి విశ్వోదయ సాంస్కృతిక సంస్థ వారు ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించారు. ‘తాత మనవడు’, ‘సంసారం సాగరం’, ‘కచదేవయాని’ సినిమాలకు ఉత్తమ నటునిగా నంది బహుమతులను అందుకున్నారు సత్యనారాయణ. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలం సత్యనారాయణకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. 2011లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి సత్యనారాయణను గౌరవించింది. సొంతవూరు కౌతవరంలో తన తాతగారి పేరుతో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని సత్యనారాయణ కట్టించిన సత్యనారాయణ గుడివాడలో ఒక కళామండపం నిర్మించారు. పేద విద్యార్థులకు చదువుతో బాటు పెళ్లిళ్లు, ఉపాధి అందిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా రెండో కుమారుడు రామారావు  కన్నడ చిత్రసీమలో పని చేస్తున్నారు. సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ కి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. కేజీఎఫ్ ప్రచారంలో భాగంగా సినీ హీరో యశ్, చిత్ర బృందం కైకాల సత్యనారాయణను ఘనంగా సన్మానించి గౌరవించింది. తన కెరీర్ లో 28 పౌరాణిక చిత్రాలు, 51 జానపద చిత్రాలు, 9 చారిత్రక చిత్రాల్లో నటించిన సత్యనారాయణ 800 సినిమాల మార్కును దాటి తన సినీ ప్రస్థానాన్ని ఘనంగా చాటుకున్నారు. ఇంతటి సుదీర్ఘ సినీ ప్రస్థానం, లెజెండరీ స్టేటస్ ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు లేకపోవటాన్ని బాహాటంగానే విమర్శిస్తారు సత్యనారాయణ. సినిమా పట్ల నిబద్ధత ఇప్పటి నటుల్లో కొరవడుతోందని తాజా ఇంటర్వ్యూల్లో తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పిన సత్యనారాయణ భారీ బడ్జెట్ చిత్రాలకంటే కథా ప్రాధాన్యమున్న చిత్రాలే పరిశ్రమకు ఉపయోగపడతాయని చెబుతారు. ఆర్టిస్టుల కోసం ప్రివ్యూలు వేసే సంస్కృతి పోవటం బాధాకరమని చెప్పే సత్యనారాయణ వచ్చే తరం నటులు తమ వృత్తి పట్ల, చరిత్ర, సంస్కృతి పట్ల బాధ్యతతో మెలగాలంటారు. ఏది ఏమైనా తెలుగు వారి హృదయంలో చెక్కు చెదరని స్థానం కైకాల సత్యనారాయణది. నవరస నటనా సార్వభౌమునిగా ఆయన సాగించిన ప్రస్థానం చేసిన సినిమాలు పోషించిన పాత్రలు అన్నీ భావితరాల నటులకు ఆదర్శం. నటన అంటే ఇవ్వగలిగే సరైన నిర్వచనం.

Post a Comment

Previous Post Next Post