Trishul News

హిందూ, ముస్లిం విద్వేషాన్ని బీజేపీ వ్యాపింపజేస్తోంది - రాహుల్ గాంధీ

న్యూడిల్లీ, త్రిశూల్ న్యూస్ :
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శనివారం బీజేపీపై నిప్పులు చెరిగారు. హిందూ, ముస్లిం విద్వేషాన్ని బీజేపీ నిరంతరం వ్యాపింపజేస్తోందని మండిపడ్డారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఆయన న్యూఢిల్లీలోని ఎర్ర కోట వద్ద జరిగిన సభలో మాట్లాడారు. ఈ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రముఖ నటుడు కమల్ హాసన్ తదితరులు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర తమిళనాడులోని కన్యాకుమారి నుంచి సెప్టెంబరులో ప్రారంభమైంది. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి శనివారం ఉదయం ఢిల్లీలో ప్రవేశించిన సందర్భంగా ఈ యాత్రలో పాల్గొన్నవారిలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, జైరామ్ రమేశ్, పవన్ ఖేరా, భూపిందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా, రణదీప్ సుర్జీవాలా, రాబర్ట్ వాద్రా, వాద్రా దంపతుల పిల్లలు ఉన్నారు.  ఎర్ర కోట వద్ద శనివారం జరిగిన భారత్ జోడో యాత్ర సభలో రాహుల్ మాట్లాడుతూ, ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం కాదని, ఇది అంబానీ, అదానీ ప్రభుత్వమని ఆరోపించారు. వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం హిందూ-ముస్లిం వివాదాలను రేపుతున్నారని మండిపడ్డారు. డిగ్రీ చదివిన యువత పకోడీలు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను 2,800 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశానని, ఈ యాత్రలో తనకు విద్వేషం కనిపించలేదని చెప్పారు. కానీ బీజేపీ మాత్రం హిందూ, ముస్లిం విద్వేషాన్ని నిరంతరం (24x7) వ్యాపింపజేస్తోందన్నారు. తాను వందలాది కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశానని, హింస, విద్వేషం ఎక్కడా కనిపించలేదని, కానీ టీవీల్లో మాత్రం అన్ని వేళలా ఇవి కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు.  తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ వేలాది కోట్ల రూపాయలను ఖర్చు చేశాయన్నారు. అయితే తాను ఒక నెలలోనే సత్యాన్ని యావత్తు దేశానికి రుజువు చేశానని చెప్పారు. కాంగ్రెస్ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ''నేను కోరిన మీదట మీరు దేశంలో ప్రేమను వ్యాపింపజేయడం కోసం లక్షలాది ప్రేమ దుకాణాలను తెరిచార''న్నారు.

Post a Comment

Previous Post Next Post