Trishul News

ఆకుల్లోనే ప్రసాద వితరణ చేయాలని ఆలయాలకు ఆదేశాలు..!

- స్వరూపానందేంద్ర సూచనకు దేవాదాయ శాఖ స్పందన
అమరావతి, త్రిశూల్ న్యూస్ :
ఇకపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లోను ఆకుల్లోనే అన్న ప్రసాద వితరణ చేయాలని అధికారులకు దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అడ్డాకులు, అరిటాకులు, విస్తరాకుల్లో మాత్రమే భక్తులకు ప్రసాదాన్ని అందించాలని ఆదేశించింది. ఈమేరకు దేవాదాయ శాఖ కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ ఆలయాల ఈఓలకు ఆదేశాలిచ్చారు. ఇటీవల అన్నవరం పుణ్యక్షేత్రంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని స్టీలు కంచాల్లో వడ్డించడం పట్ల విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అభ్యంతరం వ్యక్తం చేసారు. అది సంప్రదాయం కాదని పేర్కొంటూ అన్నవరం దేవస్థానానికి లేఖ రాసారు. స్వరూపానందేంద్ర స్వామి లేఖకు తక్షణం స్పందించిన అన్నవరం ఈఓ స్టీలు ప్లేట్లను పక్కన పెట్టారు. విస్తరాకులు, అరిటాకుల్లోనే అన్న ప్రసాదాన్ని వడ్డించే విధానాన్ని పునరుద్ధరించారు. ఇటీవల పీఠాన్ని సందర్శించిన సందర్భంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ కూడా ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవస్థానాల్లోనూ వర్తింపజేస్తామని స్వరూపానందేంద్ర స్వామికి తెలిపారు. ఆ క్రమంలోనే వడ్డనకు అవసరమైన ఆకులు ఎటువంటివి అందుబాటులో ఉంటే వాటినే ఆయా ఆలయాల్లో వినియోగించాలని ఆదేశాలు జారీ చేసారు.

Post a Comment

Previous Post Next Post