Trishul News

పేదల తలరాతను మార్చే శక్తి విద్యకు ఉంది - ఉప ముఖ్యమంత్రి

- విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకు వచ్చిన ముఖ్యమంత్రి - జిల్లా కలెక్టర్
చిత్తూరు, త్రిశూల్ న్యూస్ :
విద్యకు మించిన సంపద లేదని, అటువంటి విద్యను ప్రతి పేద విద్యార్థికి అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ శాఖామాత్యులు కె. నారాయణ స్వామి పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తన జన్మదినం సందర్భంగా 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు ఉచితంగా ట్యాబ్ లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని బాపట్ల జిల్లా చుండూరు మండలం యడ్లపల్లిలో లాంఛనంగా ప్రారంభించగా, బి.ఎస్.కన్నన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు పండుగ వాతావరణంలో జిల్లా స్థాయి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు జెడ్పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ యం. హరినారాయణన్, చిత్తూరు ఎంఎల్ఏ ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు నగర మేయర్ ఆముద పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ముక్తకంఠంతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వర్చువల్ విధానం లో ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమంను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీక్షించారు.
        ఈ సమావేశంలో  ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదల తలరాతను మార్చే శక్తి విద్యకు ఉందని, నిరుపేద విద్యార్థులకు సైతం నాణ్యమైన విద్యను అందించడంలో ముఖ్యమంత్రి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. ఇందులో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల 8వ తరగతికి చెందిన 4,59,564 మంది విద్యార్థులకు, 59,176 మంది టీచర్ లకు రూ.1,466 కోట్ల ఖర్చుతో బైజూస్ కంటెంట్ తో కూడిన 5,18,740 ట్యాబ్ లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఒక మేనమామగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఐశ్వర్యవంతులతో సమానంగా విద్యను అభ్యసించి ప్రపంచం వ్యాప్తంగా రాణించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, విద్యార్థులు దీని దృష్టిలో ఉంచుకుని బాగా చదవాలని తెలిపారు. దేశం, రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉందని, విద్య ద్వారానే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకురావడంతో పాటు విద్యార్థుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి వర్యులు అనేక కార్యక్రమాలను తీసుకువచ్చారని తెలిపారు. పాఠశాల ప్రాంగణం నుండి విద్యార్థులకు అందించే మద్యాహ్న భోజనం మెనూ వరకు ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన సూచనలు చేస్తూ ముందుకు తీసుకు వెళుతున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నాడు – నేడు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, దీని ద్వారా పాఠశాలలకు అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, పాఠశాల భవనాలు మరియు మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించి నిధులను కేటాయించడం జరుగుతున్నదని తెలిపారు. ప్రైవేటు విద్యార్థులతో సమానంగా పేద విద్యార్థులు కూడా ఉండాలని వారికి జగనన్న విద్యాకానుక ద్వారా 3 జతల స్కూల్ యూనిఫారం లు, షూస్, బ్యాగ్, బెల్ట్, తదితరాలను అందిస్తున్నామని తెలిపారు. అమ్మఒడి క్రింద 75 హాజరు ఉన్న ప్రతి విద్యార్థి యొక్క తల్లి ఖాతాలకు రూ.15 వేలు ప్రభుత్వం జమ చేస్తున్నదని తెలిపారు. జగనన్న గోరుముద్ద క్రింద ఎప్పటికప్పుడు కొత్త మెనూతో విద్యార్థులకు చిక్కీ, కోడి గ్రుడ్డు తో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం జరుగుతున్నదని తెలిపారు. 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా రూ.16,500 ల విలువగల ట్యాబ్ లను దాదాపుగా రూ. 15,500 విలువ గల బైజూస్ కంటెంట్ తో కలిపి అందించడం జరుగుతుందని, దీని ద్వారా ప్రైవేటు విద్యార్థులతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ఆన్ లైన్ ద్వారా విద్యను అభ్యసించవచ్చని తెలిపారు.  
చిత్తూరు ఎం ఎల్ ఏ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, గత మూడు సంవత్సరాలుగా విద్యా విధానంలో మన రాష్ట్రంలో తీసుకువస్తున్న మార్పులు, అభివృద్ధి కారణంగా దేశంలోని పలు రాష్ట్రాలు మన ముఖ్యమంత్రి గారి పరిపాలనా విధానాన్ని ప్రశంసిస్తున్నాయని తెలిపారు. విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంటెంట్ తో కూడిన ట్యాబ్ లను అందించడం జరుగుతున్నదని, దీనిలోని అంశాలను క్షుణ్ణంగా అభ్యసించి మంచి విద్యావంతులుగా ఎదగాలని తెలిపారు. డిఈఓ విజయేంద్రరావు మాట్లాడుతూ పాఠశాల విద్యలో మరో విప్లవాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారని, పభుత్వ స్కూల్ లలో పాఠ్యాంశాల బోధనలో మరో కొత్త శకం ఆరంభం కానున్నదని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చి దిద్దేలా అడుగులు వేస్తున్నాడని, అత్యున్నత ప్రమాణాలతో కూడిన డిజిటల్ పాఠ్యాంశాలను అందించుటకు వీలుగా ట్యాబ్ లను ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ లలోని 8వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ అందించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం తొలుత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం కాగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ రమ్య, నగర ఉప మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,  సమగ్ర శిక్షా అడిషనల్ కొ ఆర్డినేటర్ వెంకటరమణా రెడ్డి, చిత్తూరు డివై.ఈ.ఓ చంద్రశేఖర్, కార్పొరేటర్ లు, జెడ్పిటిసిలు, సమగ్ర శిక్షా సిఎంఓ గుణశేఖర్ రెడ్డి, ఐఈ కొ ఆర్డినేటర్ ప్రభాకర్ వర్మ, ఏఎల్ఎస్ కొ ఆర్డినేటర్ అజయ్ కుమార్ రెడ్డి, ఎంఈఓ సెల్వ రాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post